మధ్యపానం, ధూమపానం నిషేదాలపై కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన నిబంధనలు అమలుచేస్తున్నాయి. వాటిపట్ల ఎటువంటి ఆరోగ్య ఇబ్బందులు ఎదురవుతాయో సామాజిక మాధ్యమాలు చెప్పే ప్రయత్నాలను చేస్తున్నాయి. తాజాగా ధూమపానంపై జార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బహిరంగ ప్రదేశాల్లో సిగరెట్ వెలిగించినా, గుట్కా నమిలినా రూ. 1000 జరిమానా విధించాలని సీఎం హేమంత్ సోరెన్ కేబినెట్ నిర్ణయించింది.
రాష్ట్ర ప్రభుత్వం పొగాకు ఉత్పత్తులపై నిషేధం విధించాలని నిర్ణయం తీసుకుంది. ఈ నేఫథ్యంలోనే హుక్కా బార్లను కూడా పూర్తిగా మూసివేయనున్నారు. నిబంధనలు ఉల్లంఘించి హుక్కా బార్లను నిర్వహిస్తే.. అటువంటి వారిపై కొరడా జులిపించనున్నారు. అలాంటి వారికి మూడేండ్ల జైలు శిక్ష విధించనున్నారు. అలాగే 21 ఏళ్ల లోపు వారికి సిగరెట్, గుట్కా విక్రయించకుండా చర్యలు తీసుకోవాలని కేబినెట్ నిర్ణయించింది.
అంతేకాకుండా విద్యాసంస్థలు, ఆస్పత్రులు, వైద్యారోగ్య సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, కోర్టులు, ఆధ్యాత్మిక కేంద్రాలకు 100 మీటర్ల దూరంలో ఎలాంటి సిగరెట్, గుట్కా విక్రయాలు జరపొద్దని కేబినెట్ ఆదేశించింది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకొవాలని అధికారులను ఆదేశించింది.