రుణాలపై వడ్డీ మాఫీ చేసిన ప్రభుత్వం.. 70 వేల మంది రైతులకు ప్రయోజనం
జార్ఖండ్ ప్రభుత్వం రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అనేక పథకాలను ప్రారంభించింది
By Medi Samrat Published on 7 Oct 2024 8:59 PM ISTజార్ఖండ్ ప్రభుత్వం రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అనేక పథకాలను ప్రారంభించింది. ఇప్పుడు రాష్ట్రంలోని ఏ రైతు కూడా KCC (కిసాన్ క్రెడిట్ కార్డ్) రుణంపై ఎలాంటి వడ్డీని చెల్లించాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వమే భరించేందుకు సిద్ధమైంది. అయితే రైతు తాను తీసుకున్న రుణం అన్ని వాయిదాలను సకాలంలో జమ చేస్తేనే ఈ పథకం వర్తిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.8 కోట్ల రుణ వడ్డీని బ్యాంకులకు చెల్లించింది. జార్ఖండ్ స్టేట్ గ్రామీణ బ్యాంకుకు గరిష్టంగా రూ.6.36 కోట్లు చెల్లించింది. ఈ బ్యాంకు నుంచి 54,886 మంది రైతులు కేసీసీ రుణం తీసుకున్నారు.
రాష్ట్రంలోని 69,073 మంది రైతులు మొత్తం 12 బ్యాంకుల నుంచి కేసీసీ రుణాలు తీసుకున్నారు. రైతులు తమ రుణాలకు సంబంధించిన వాయిదాలను సకాలంలో చెల్లించారన్నారు. కిసాన్ క్రెడిట్ కార్డ్ (KCC) రుణంపై విధించే మొత్తం వడ్డీ ఏడు శాతం. ఇందులో మూడు శాతం వడ్డీని కేంద్ర ప్రభుత్వం, మూడు శాతం వడ్డీ రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. దీంతో రైతులు KCC రుణంపై ఒక శాతం వడ్డీ మాత్రమే చెల్లించాల్సి వచ్చింది.
ఒక్క శాతం వడ్డీ కూడా చెల్లించలేక చాలా మంది రైతులు కేసీసీ రుణాలు తీసుకోవడం లేదని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. రైతు కేసీసీ రుణం తీసుకుంటే ఒక్క శాతం వడ్డీ కూడా కట్టలేని పరిస్థితి నెలకొంది.
రైతులకు సహాయం చేయడానికి.. KCC రుణాలు తీసుకునేలా రైతులను ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక శాతం వడ్డీని భరించాలని నిర్ణయించింది. అలాగే KCC రుణాలపై వడ్డీని మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే కేసీసీ రుణం వాయిదాలు చెల్లించే రైతులకు మాత్రమే లబ్ధి చేకూరుతుందని ప్రభుత్వం షరతు విధించింది.
2023-24 సంవత్సరంలో మొత్తం 12 బ్యాంకులు సుమారు 70 వేల మంది రైతుల కెసీసీ రుణాలపై రూ. 8.14 కోట్ల వడ్డీని క్లెయిమ్ చేశాయి.