కాంగ్రెస్ పార్టీని వీడుతున్న కీలక నేతల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతూ ఉంది. కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి జైవీర్ షేర్ గిల్ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖలో కాంగ్రెస్ హైకమాండ్ పై తీవ్ర విమర్శలు చేశారు. పార్టీ అధినాయకత్వం ప్రచారం చేసుకుంటున్న దార్శనికతకు, యువత ఆశయాలకు ఏమాత్రం పొంతనలేకుండా ఉందని.. ముగ్గురు గాంధీలు (సోనియా, రాహుల్, ప్రియాంక) గత ఏడాది కాలంగా తనకు అపాయింట్ మెంట్ నిరాకరిస్తున్నారని 39 ఏళ్ల జైవీర్ షేర్ గిల్ ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధుల్లో అందరికంటే చిన్నవాడు షేర్ గిల్. కాంగ్రెస్ అధినాయకత్వం ఆలోచనలకు, ఆధునిక భారతదేశంలోని క్షేత్రస్థాయిలో పరిస్థితులకు ఏమాత్రం సమన్వయం కుదరడంలేదు. నా మనోభావాలను పంచుకునేందుకు సమయం ఇవ్వండంటూ ఏడాదిగా అడుగుతున్నా, నన్ను ఒక్కరు కూడా పార్టీ ఆఫీసుకు రమ్మని ఆహ్వానించలేదని షేర్ గిల్ చెప్పుకొచ్చారు.
పార్టీ అగ్రనాయకత్వానికి సన్నిహితంగా మెలిగే వారి ముందు అణిగిమణిగి పడి ఉండాలని ఆరోపించారు. అందుకే పార్టీతో అన్ని సంబంధాలు తెంచుకుంటున్నానని జైవీర్ షేర్ గిల్ స్పష్టం చేశారు.