అజిత్‌ దోవల్‌పై పాకిస్థాన్‌ నిఘా.. ఉగ్రవాదులు రెక్కీ

Jaish terrorist reveals Pak’s plan to target NSA Ajit Doval. జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్‌ దోవల్‌ అంటే చాలు పాకిస్థాన్

By Medi Samrat  Published on  13 Feb 2021 10:47 AM GMT
అజిత్‌ దోవల్‌పై పాకిస్థాన్‌ నిఘా.. ఉగ్రవాదులు రెక్కీ

జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్‌ దోవల్‌ అంటే చాలు పాకిస్థాన్ కు ఎంత భయమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా ఆయన మీద పాకిస్థాన్‌ నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. 2019లో పీవోకేలోని ఉగ్ర స్థావరాలున్న బాలాకోట్‌పై భారత వాయుసేన మెరుపుదాడుల అనంతరం జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్‌ దోవల్‌ పాకిస్థాన్ ఉగ్రవాదుల హిట్‌ లిస్ట్‌లో చేరారు. అంతేకాకుండా ఆయన కార్యాలయం, నివాసం వద్ద ఆ దేశ ఉగ్రవాదులు రెక్కీ నిర్వహించడమే కాకుండా.. ఆయనకు సంబంధించిన కీలక సమాచారాన్ని పాక్‌కు చేరవేశారని ఇటీవల అరెస్టైన జైష్-ఎ-మొహమ్మద్ (జేఈఎమ్) ఉగ్రవాది హిదాయత్ ఉల్లా మాలిక్ తెలిపాడు. ఈ నేపథ్యంలో అజిత్‌ దోవల్‌ కార్యాలయం, నివాసం వద్ద భద్రతను పెంచారు.

జమ్ముకశ్మీర్‌కు చెందిన షోపియన్ నివాసి మాలిక్‌ను ఈ నెల 6న అరెస్ట్‌ చేశారు. వాహనంతోపాటు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసునకు సంబంధించి మాలిక్‌ భార్య, చండీగఢ్‌ కాలేజీలో చదువుతున్న విద్యార్థితోపాటు బీహార్‌కు చెందిన ఒక వ్యక్తిని అధికారులు ప్రశ్నించారు. 2019 మే 24న శ్రీనగర్‌ నుంచి విమానంలో ఢిల్లీకి చేరుకున్నానని మే 25న పలు ముఖ్య కార్యాలయాలను వీడియో తీశానని, ఇందులో దోవల్‌ కార్యాలయం కూడా ఉందని మాలిక్‌ విచారణలో వెల్లడించాడు. శ్మీర్‌కు బస్సులో తిరిగి వెళ్లినట్లు చెప్పాడు. ఆ వీడియోలను వాట్సాప్‌ ద్వారా పాకిస్థాన్‌కు చెందిన 'డాక్టర్' అనే వ్యక్తికి పంపినట్లు తెలిపాడు.

2019లో పుల్వామా ఉగ్రదాడితో సంబంధం ఉండి అరెస్టైన ఉగ్రవాది సమీర్‌ అహ్మద్‌ దార్‌తో కలిసి సాంబా సెక్టర్‌లోని సరిహద్దు ప్రాంత్రాన్ని కూడా వీడియో తీసినట్లు వివరించాడు. 2020 మేలో జరిగిన ఆత్మహుతి దాడి కోసం కారును ఏర్పాటు చేసినట్లు తెలిపాడు. మరో ముగ్గురు జైష్ ఉగ్రవాదులు ఇర్ఫాన్ తోకర్, ఉమర్ ముష్తాక్, రాయీస్ ముస్తఫాతో కలిసి 2020 నవంబర్‌లో షోపియన్‌లోని జమ్ముకశ్మీర్‌ బ్యాంక్‌కు చెందిన నగదు వ్యాన్ నుంచి రూ.60 లక్షలను దోచుకున్నట్లు ఒప్పుకున్నాడు.


Next Story