జైలులో ఫుల్ పార్టీ.. సోషల్ మీడియాలో వీడియో కూడా అప్లోడ్

Jailed gangsters found having liquor. జైలులో ఉన్న ఇద్దరు గ్యాంగ్‌స్టర్‌ లు కలిసి పార్టీ చేసుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో

By Medi Samrat  Published on  26 Aug 2021 10:39 AM GMT
జైలులో ఫుల్ పార్టీ.. సోషల్ మీడియాలో వీడియో కూడా అప్లోడ్

జైలులో ఉన్న ఇద్దరు గ్యాంగ్‌స్టర్‌ లు కలిసి పార్టీ చేసుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఢిల్లీలోని జైలు లాకప్ లో మద్యం తాగుతూ.. స్నాక్స్‌ తింటూ కనిపించారు. రాహుల్ కాలా, నవీన్ బాలి అనే ఇద్దరు గ్యాంగ్‌స్టర్‌లు గతంలో హత్యలు, దోపిడీలకు పాల్పడ్డారు. ఈ నెల ప్రారంభంలో ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్ జైలు లోపల నుండి వారి ప్రత్యర్థి ముఠా సభ్యుడిని చంపడానికి కుట్ర పన్నిన కేసులో వారిని పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన వీళ్లు ప్రస్తుతం తీహార్ మండోలి జైలులో ఉన్నారు. లోధి కాలనీ స్పెషల్ పోలీస్ సెల్ యూనిట్ బృందం వారిద్దరినీ విచారణ కోసం కస్టడీలోకి తీసుకుని ఒక వారానికి పైగా లాకప్‌లో ఉంచింది.

వారు ఆగస్టు 10 వరకు ప్రత్యేక కస్టడీలో ఉన్నారు. వారిని మళ్లీ మండోలి జైలుకు పంపించారు. ఇప్పుడు వారు పార్టీ చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మండోలి జైలులోది అయినా అయ్యుంటుంది.. లేదా ప్రత్యేక సెల్ లాకప్‌కు సంబంధించినదని చెబుతున్నారు. రాహుల్ కాలా, నవీన్ బాలి లాకప్ లోపల మరో ముగ్గురు వ్యక్తులతో కూర్చొని ఉన్నారు. ఒక చేతిలో మద్యం, మరో చేతిలో సిగరెట్ తో ఎంజాయ్ చేస్తున్నారు. ఒకరు ఫోన్‌లో మాట్లాడుతుండగా, మరొకరు వీడియో తీస్తున్నారు. ఈ వీడియోని ఆ జైలులో ఉన్న ఢిల్లీకి చెందిన ఓ గ్యాంగ్‌స్టర్ నీరజ్ బవన పోస్ట్ చేశాడు. రెండు సంవత్సరాల క్రితం బాలిని పట్టుకోగా, 2014 లో కాలాను అరెస్టు చేశారు. క్రిమినల్స్ కు వీఐపీ ట్రీట్మెంట్ ఇస్తున్న ఢిల్లీ పోలీసు విభాగంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.


Next Story
Share it