మొదలైన జగన్నాథుని రథయాత్ర.. ప్రసారమాధ్యమాల ద్వారానే వీక్షణ

Jagannath Puri Rath Yatra 2021 Live Update. జగన్నాథుని రథయాత్ర ఈ ఏడాది కరోనా కారణంగా జనసంచారం లేని వీధుల గుండా నేడు

By Medi Samrat  Published on  12 July 2021 10:19 AM GMT
మొదలైన జగన్నాథుని రథయాత్ర.. ప్రసారమాధ్యమాల ద్వారానే వీక్షణ
జగన్నాథుని రథయాత్ర ఈ ఏడాది కరోనా కారణంగా జనసంచారం లేని వీధుల గుండా నేడు నిర్వహించనున్నారు. శ్రీమందిరం నుంచి గుండిచామందిరం వరకు సాగే ఈ యాత్రలో బొడొదండొ దారి పొడవునా బలభద్ర, సుభద్ర, జగ న్నాథుని రథాలను లాగే గొప్ప కార్యక్రమం చోటుచేసుకొంటుంది. ఈ నేపథ్యంలో తగిన ఏర్పాట్లను నిర్వాహకులు చేశారు. కోవిడ్‌ నియంత్రణ చర్యల దృష్ట్యా గతేడాది తరహాలో లాగే ఈసారి కూడా యాత్రకు భక్తులకు ప్రవేశం నిషేధిస్తూ చర్యలు చేపట్టారు. పరిమితమైన సిబ్బంది, సేవాయత్‌లతో ప్రాచీన సంస్కృతీ సంప్రదాయాలతో యాత్ర నిర్వహిస్తారు. ఇప్పటికే యాత్రలో పాల్గొనే వారందరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, అంతకుముందే ఆయా వర్గాల వారికి కోవిడ్‌ వ్యాక్సిన్‌ కూడా వేశారు. సుప్రీంకోర్టు ఆంక్షలకు అనుగుణంగా రథాలను లాగేందుకు సేవాయత్‌లు, పోలీసులను మాత్రమే నియమించారు. ఒక్కోరథం లాగేందుకు గరిష్టంగా 500 మంది ఉంటారని అధికారులు తెలిపారు.


పట్టణంలో కర్ఫ్యూ విధించి, పట్టణ సరిహద్దుల్లో ఇతర ప్రాంతాల వారి రాకపోకలను పూర్తిగా నిషేధించారు. ఈ నెల 13వ తేదీ వరకు కర్ఫ్యూ నిబంధనలు కొనసాగుతాయి. పూరీ పట్టణాన్ని 12 జోన్లుగా విభజించారు అధికారులు. 65 ప్లాటూన్ల పోలీస్‌ బలగాలతో భద్రతా చర్యలు చేపట్టారు. భద్రతా బలగాల్లో 10 మంది అదనపు పోలీస్‌ సూపరింటెండెంట్లు, 31 మంది డిప్యూటీ పోలీస్‌ సూపరింటెండెంట్లు, 64 మంది ఇన్‌స్పెక్టర్లు, 222 మంది సహాయ సబ్‌–ఇన్‌స్పెక్టర్లు, సబ్‌–ఇన్‌స్పెక్టర్లుని నియమించినట్లు పూరీ జిల్లా పోలీస్‌ సూపరింటెండెంట్‌ కె.వి.సింఘ్‌ తెలిపారు.

రథాలను సేవలకు సిద్ధం చేసిన అధికారులు.. వాటిని దక్షిణాభిముఖంగా శ్రీక్షేత్రం ఎదుట నిలిపారు. శ్రీక్షేత్ర కార్యాలయం ఎదుట అక్షయ తృతీయ నుంచి ప్రారంభమైన రథాల తయారీ పనులు ఆదివారంతో ముగిసాయి. కరోనా సంక్షోభం కారణంగా జగన్నాథ యాత్రకు పూరీలో మాత్రమే నిర్వహించేందుకు సుప్రీంకోర్టు అనుమతిచ్చింది. పూరీ మినహా మిగిలిన ప్రాంతాల్లో రథయాత్రల్ని అనుమతించేది లేదని ఒడిశా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు కూడా సమర్ధించింది. ప్రసార మాధ్యమాల ద్వారా వేడుకలను భక్తులు ఇళ్లల్లో కూర్చొని చూడాలని పేర్కొంది.


Next Story