ఇరాన్ నుంచి చమురు ట్యాంకర్ భారత్‌కు చేరుకుంటూ ఉంది. పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో సముద్రంలో నిలిచిపోయిన ఇరాన్ ముడి చమురుపై అమెరికా ఆంక్షలు ఎత్తివేయడంతో ఇరాన్ ముడిచమురు కొనుగోలుకు భారత రిఫైనరీలు ఆసక్తిని కనబరుస్తున్నాయి. ఇరాన్ నుంచి వస్తున్న చమురు ట్యాంకర్ ఏప్రిల్ 4న గుజరాత్‌లోని వాడినార్ పోర్టుకు చేరుకోనుందని డేటా ఇంటెలిజెన్స్ సంస్థ కెప్లర్ వెల్లడించింది. ఏప్రిల్ 4వ తేదీన ఖర్గ్ ద్వీపం వద్ద ట్యాంకర్ లోకి ముడి చమురు లోడింగ్ చేశారు. ఇందులో 6,00,000 బ్యారెళ్ల ముడి చమురు ఉండొచ్చని అంచనా. 2019 తర్వాత ఇరాన్ చమురు భారత్‌కు రావడం ఇదే మొదటిసారి. 2019 వరకు భారత చమురు దిగుమతుల్లో 11.5 శాతం ఇరాన్ వాటా ఉండేది. 2018లో భారత్ రోజుకు సుమారు 5,18,000 బ్యారెళ్ల ఇరాన్ చమురును దిగుమతి చేసుకోగా, మే 2019 నాటికి అది రోజుకు 2,68,000 బ్యారెళ్లకు తగ్గింది.