మణిపూర్‌లో ఇంటర్నెట్ సేవలను పూర్తిగా పునరుద్ధరించనున్నట్టు మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ ప్రకటించారు. నాలుగు నెలలుగా హింసతో అట్టుడుకుతున్న మణిపూర్ లో ప్రస్తుతం పరిస్థితులు మెరుగుపడటం వల్లే ఇంటర్నెట్ ను అందుబాటులోకి తీసుకుని వచ్చామని సీఎం బీరెన్ సింగ్ తెలిపారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్నెట్‌పై నిషేధం విధించామని స్పష్టం చేశారు. నేటి నుంచి ప్రజలకు ఇంటర్నెట్ సేవలను అందుబాటులోకి తెస్తున్నామని ముఖ్యమంత్రి విలేకరుల సమావేశంలో తెలిపారు.
రాష్ట్రంలో ఇంటర్నెట్ సేవలు నిలిపివేయడంతో.. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, విద్యాసంస్థలు, ఆరోగ్య సదుపాయాలు సహా వివిధ రంగాలపై తీవ్ర ప్రభావం పడింది. దీనిపై సమీక్షించిన ప్రభుత్వం తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. మే నెలలో మెజారిటీ మెయిటీ కమ్యూనిటీ, మైనారిటీ కుకీ తెగల మధ్య గొడవలు తారాస్థాయికి చేరుకోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్నెట్ ను షట్‌డౌన్ చేసింది. మణిపూర్ లో మే 3న హింస చెలరేగినప్పటి నుండి 160 మందికి పైగా మరణించారు. జూలై 25న మణిపూర్‌లో నిర్దిష్ట షరతులతో బ్రాడ్‌బ్యాండ్ సేవలు పునరుద్ధరించారు. తాజాగా ఇంటర్నెట్ సేవలను అందుబాటులోకి తెచ్చారు