ప్రైవేట్ పార్ట్స్‌పై గాయం గుర్తులు అవసరం లేదు.. 40 ఏళ్ల నాటి అత్యాచారం కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు

40 ఏళ్ల నాటి అత్యాచారం కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

By Medi Samrat  Published on  11 March 2025 11:46 AM IST
ప్రైవేట్ పార్ట్స్‌పై గాయం గుర్తులు అవసరం లేదు.. 40 ఏళ్ల నాటి అత్యాచారం కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు

40 ఏళ్ల నాటి అత్యాచారం కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అత్యాచార‌ నేరం రుజువు కావాలంటే ప్రైవేట్ పార్ట్స్‌పై గాయం గుర్తులు ఉండాల్సిన అవసరం లేదని కోర్టు పేర్కొంది. ఇతర ఆధారాలను కూడా ప్రాతిపదికగా ఉపయోగించవచ్చు అని పేర్కొంది.

1984లో బీఏ విద్యార్థినిపై అత్యాచారం చేసిన కేసులో ఓ వ్యక్తికి విధించిన శిక్షను కోర్టు సమర్థించింది. ఆ వ్యక్తికి ఐదేళ్ల శిక్ష పడింది. ఓ ట్యూషన్ టీచర్ తన విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపించారు. బాధితురాలి ప్రైవేట్ పార్టులపై ఎలాంటి గుర్తులు లేవని.. అందుకే అత్యాచారం జరిగినట్లు రుజువు కాలేదని.. బాధితురాలి తల్లి తనపై తప్పుడు ఆరోపణలు చేసిందని టీచర్ తరఫున న్యాయ‌వాది వాదించారు.

అయితే నిందితుడి న్యాయ‌వాది చేసిన వాదనలను కోర్టు తోసిపుచ్చింది. జస్టిస్‌ సందీప్‌ మెహతా, జస్టిస్‌ ప్రసన్న బి వరాలేలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. ప్రతి అత్యాచారం కేసులోనూ బాధితురాలి శరీరంపై గాయం గుర్తులు ఉండాల్సిన అవసరం లేదని జస్టిస్ వరాలె అన్నారు. ఏదైనా కేసు పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. అందువల్ల, అత్యాచారాన్ని నిరూపించడానికి బాధితురాలి శరీరంపై గాయం గుర్తులు అవసరం లేదు అని పేర్కొన్నారు.

ప్రాసిక్యూట్రిక్స్ వాంగ్మూలం ప్రకారం.. నిందితుడు బాధితురాలిని బలవంతంగా మంచంపైకి నెట్టి ఆమె ప్రతిఘటిస్తున్నా పట్టించుకోకుండా గుడ్డ ముక్కతో కట్టి ఉంచాడు.. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటే గాయం గుర్తులు కావు అని పేర్కొంది.

అప్పీలుదారు లోక్ మల్ అలియాస్ లోకు జూలై 22, 2010 నాటి అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ ఉత్తర్వును సవాలు చేశాడు. ఇది IPC సెక్షన్లు 376, 323 కింద తనను దోషిగా నిర్ధారిస్తూ ట్రయల్ కోర్టు నిర్ణయాన్ని సమర్థించింది. ట్రయల్ కోర్టు నిందితుడికి అత్యాచారం కేసులో ఐదేళ్లు, గాయపరిచినందుకు అదనంగా మరో ఆరు నెలలు శిక్ష విధించింది.

ప్రాసిక్యూషన్ ప్రకారం.. మార్చి 19, 1984న బాధితురాలు ట్యూషన్ కోసం నిందితుడి ఇంటికి వెళ్ళినప్పుడు అతడు తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. శబ్దం చేస్తే చంపేస్తానని బెదిరించి అత్యాచారానికి పాల్ప‌డ్డాడు.

Next Story