ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు, చైర్మన్ నందన్ నీలేకని ఐఐటీ బాంబేకి రూ.315 కోట్లు విరాళంగా ఇచ్చారు. నీలేకని ఐఐటి బాంబేతో తన అనుబంధానికి గుర్తింపుగా $38.3 మిలియన్ల మొత్తాన్ని విరాళంగా ఇచ్చారు. నీలేకని నుండి అందుకున్న ఈ మొత్తాన్ని ఐఐటి యొక్క మౌలిక సదుపాయాలు, పరిశోధన, సాంకేతికత, డీప్ టెక్ స్టార్టప్ ఎకోసిస్టమ్ అభివృద్ధి కోసం ఖర్చు చేస్తారు.
ఐఐటీ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. గతంలో నీలేకని ఇచ్చిన రూ.85 కోట్లు కలిపితే ఆ సంస్థకు నీలేకని చేసిన సాయం రూ.400 కోట్లు అవుతుంది. దేశంలోనే పూర్వ విద్యార్థులు అందించిన అతిపెద్ద విరాళాల్లో ఇదొకటి అని తెలిపింది. ఇంజినీరింగ్, టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్‌లలో ఐఐటీ-బాంబే అగ్రగామిగా ఎదగడానికి ఇది సహాయపడుతుంది. నీలేకని 1973లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ కోసం ఐఐటీ బాంబేలో చేరారు.
నందన్ నీలేకని మాట్లాడుతూ.. 'ఐఐటీ-బాంబే నా జీవితానికి మూలస్తంభం. నా ప్రయాణానికి పునాది వేసింది. నేను ఐఐటీ-బాంబే వంటి ప్రతిష్టాత్మక సంస్థతో 50 సంవత్సరాల అనుబంధాన్ని పూర్తి చేశాను. ఈ సంస్థను ముందుకు తీసుకెళ్లి దాని భవిష్యత్తుకు సహకరించినందుకు నేను కృతజ్ఞుడనని పేర్కొన్నారు.