విమాన సర్వీసుల పునరుద్ధరణపై ఇండిగో కీలక ప్రకటన
ఇటీవల భారీ అంతరాయాలతో ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో.. తన కార్యకలాపాలను తిరిగి సాధారణ స్థితికి తీసుకొస్తోంది.
By - Knakam Karthik |
విమాన సర్వీసుల పునరుద్ధరణపై ఇండిగో కీలక ప్రకటన
ఇటీవల భారీ అంతరాయాలతో ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో.. తన కార్యకలాపాలను తిరిగి సాధారణ స్థితికి తీసుకొస్తోంది. తమ సేవల్లో స్థిరమైన, బలమైన మెరుగుదల కనిపిస్తోందని ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. కార్యకలాపాలను పునరుద్ధరించే పనుల్లో వేగం పెంచామని, పరిస్థితిని చక్కదిద్దుతున్నామని పేర్కొంది.
శనివారం సుమారు 1,500 విమానాలు నడపగా, ఆదివారం ఆ సంఖ్యను 1,650కి పైగా పెంచినట్లు ఇండిగో వెల్లడించింది. కేవలం 30 శాతంగా ఉన్న విమానాల సమయపాలన (OTP) ఒక్కరోజులోనే 75 శాతానికి మెరుగుపడిందని వివరించింది. గత రెండు రోజులుగా తమ నెట్‌వర్క్‌ను స్థిరీకరించేందుకు పలు కీలక చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. హైదరాబాద్ విమానాశ్రయంలో 26 రాకపోకలు మరియు 43 నిష్క్రమణలు సహా 69 ప్రణాళికాబద్ధమైన రద్దులు నమోదయ్యాయి. GMR నిర్వహిస్తున్న ఢిల్లీ విమానాశ్రయంలో, 37 నిష్క్రమణలు మరియు 49 రాకపోకలు సహా 86 ఇండిగో విమానాలు ఈ రోజు రద్దు చేయబడ్డాయి.
విమానాల రద్దు సమాచారాన్ని ప్రయాణికులకు ముందుగానే అందిస్తున్నామని, దీనివల్ల వారి ఇబ్బందులు తగ్గుతున్నాయని పేర్కొంది. రిఫండ్‌లు, బ్యాగేజీ సంబంధిత ప్రక్రియలు కూడా పూర్తి సామర్థ్యంతో సజావుగా సాగుతున్నాయని స్పష్టం చేసింది. తొలుత అంచనా వేసిన దానికంటే ముందుగానే, అంటే డిసెంబర్ 10 నాటికే కార్యకలాపాలు పూర్తిస్థాయిలో సాధారణ స్థితికి వస్తాయని విశ్వాసం వ్యక్తం చేసింది.
అయినప్పటికీ, ప్రయాణికులు ఎయిర్‌పోర్టుకు బయల్దేరే ముందు తమ వెబ్‌సైట్‌లో ఫ్లైట్ స్టేటస్‌ను సరిచూసుకోవాలని సూచించింది. గత కొన్ని రోజులుగా కలిగిన అసౌకర్యానికి మరోసారి క్షమాపణలు చెబుతూ.. ప్రయాణికుల సహనానికి, ఉద్యోగుల కృషికి కృతజ్ఞతలు తెలిపింది. పూర్తి సాధారణ స్థితికి వేగంగా చేరుకునేందుకు అధికారులతో కలిసి పనిచేస్తున్నామని ఇండిగో ప్రతినిధి వివరించారు.
— IndiGo (@IndiGo6E) December 7, 2025