వారికి రూ.లక్ష పరిహారంగా ఇవ్వండి.. ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు కన్స్యూమర్ ఫోరం షాక్..!
చండీగఢ్ నుంచి బెంగళూరుకు వెళ్తున్న 70 ఏళ్ల సునీల్ జంద్, ఆయన భార్య 67 ఏళ్ల వీణా కుమారిలకు ఎయిర్‌పోర్టులో వీల్‌చైర్ ఇవ్వనందుకు ఇండియో ఎయిర్‌లైన్స్‌కు జిల్లా వినియోగదారుల కమిషన్ రూ.లక్ష జరిమానా విధించింది.
By Medi Samrat Published on 7 Nov 2024 2:49 PM ISTచండీగఢ్ నుంచి బెంగళూరుకు వెళ్తున్న 70 ఏళ్ల సునీల్ జంద్, ఆయన భార్య 67 ఏళ్ల వీణా కుమారిలకు ఎయిర్‌పోర్టులో వీల్‌చైర్ ఇవ్వనందుకు ఇండియో ఎయిర్‌లైన్స్‌కు జిల్లా వినియోగదారుల కమిషన్ రూ.లక్ష జరిమానా విధించింది.
సెక్టార్-46 నివాసి సునీల్ చంద్, అతని భార్య 11 అక్టోబర్ 2023న ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో ప్రయాణించారు. అతని టికెట్ బుకింగ్‌లో రెండు వీల్‌చైర్లు కూడా ఉన్నాయి. కానీ అతను చండీగఢ్ విమానాశ్రయానికి చేరుకున్నాక వీల్‌చైర్ కోసం చాలాసేపు వేచి ఉండాల్సి వచ్చింది. ఎయిర్ లైన్స్ సిబ్బంది కూడా అతనితో దురుసుగా ప్రవర్తించారు. బెంగుళూరు ఎయిర్‌పోర్టుకు చేరుకున్నాక కూడా ఆయనను ఇదే విధంగా ట్రీట్ చేశారు. దీంతో సునీల్ చంద్ వినియోగదారుల కమిషన్‌లో ఎయిర్‌లైన్స్‌పై ఫిర్యాదు చేశాడు. వారి ఫిర్యాదు ఆధారంగా.. కమీషన్ సేవలో నిర్లక్ష్యానికి ఎయిర్‌లైన్‌ను దోషిగా నిర్ధారించింది. వృద్ధ దంపతులకు ఒక్కొక్కరికి రూ. 50,000 పరిహారం ఇవ్వాలని నిర్ణయించింది.
బెంగళూరులో తన రెండు మోకాళ్లకు ఆపరేషన్ చేయించుకోవాలని వెళ్తున్నట్లు సునీల్ చంద్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. అప్పటికే భార్య మోకాలికి శస్త్రచికిత్స జరిగింది. టికెట్‌లో రెండు వీల్‌ఛైర్లు కూడా బుక్ చేసుకున్నాడు. చండీగఢ్ నుంచి సాయంత్రం 4.45 గంటలకు విమానం బయలుదేరాల్సి ఉంది. చండీగఢ్ విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు వీల్ చైర్ కూడా ఇవ్వలేదు. సిబ్బందిని అడిగితే ఇండిగో విండో దగ్గరకు వెళ్లి మాట్లాడాలని సమాధానం వచ్చింది. ఇండిగో విండో దాదాపు 40 అడుగుల దూరంలో ఉండడంతో అతికష్టమ్మీద అక్కడికి చేరుకున్నారు.
ఫ్లైట్ టేకాఫ్ కావడానికి ఇంకా గంట సమయం ఉండడంతో అతన్ని బిజినెస్ లాంజ్‌కి తీసుకెళ్లారు. సిబ్బంది అతన్ని లాంజ్‌లో వదిలిపెట్టారు.. కానీ ఎక్కే సమయంలో ఎవరూ అతన్ని లోపలికి తీసుకెళ్లడానికి రాలేదు. విమానం బయలుదేరడానికి 10 నిమిషాల ముందు వీల్‌ఛైర్‌లో విమానంలోకి తీసుకెళ్లారు. ఈ సమయంలో అతను చాలా సమస్యలను ఎదుర్కోవలసి వచ్చింది. బెంగుళూరు విమానాశ్రయంలో కూడా ఇలాగే జరిగింది. అక్కడ కూడా వీల్ చైర్ కోసం ఎదురుచూడాల్సి వచ్చింది.
సిబ్బంది తీరుపై సునీల్ చంద్ ఫిర్యాదు చేశారు. ఎయిర్‌లైన్ మేనేజర్ జాఫర్ నఖ్వీ అతనికి క్షమాపణలు చెబుతూ.. రెండు వేల రూపాయల వోచర్ ఇవ్వడానికి ప్రయత్నించబోయాడు. కానీ ఆయన వినియోగదారుల కమిషన్‌లో ఎయిర్‌లైన్స్‌పై కేసు వేశారు.
అతని ఫిర్యాదును సమర్థిస్తూ.. వృద్ధులు, అనారోగ్యంతో ఉన్న ప్రయాణీకులను జాగ్రత్తగా చూసుకోవడం విమానయాన సంస్థ బాధ్యత అని కమిషన్ తెలిపింది. విమానయాన సంస్థకు పరిహారంగా ఇద్దరు ప్రయాణికులకు రూ.50,000 ఇవ్వాలని కమిషన్ నిర్ణయించింది.