భారీ సంఖ్యలో ఇండిగో ఫ్లైట్స్ రద్దు..ఎయిర్‌పోర్టులలోనే ప్రయాణికుల పడిగాపులు
దేశవ్యాప్తంగా తన కార్యకలాపాలు దెబ్బతినడంతో ఇండిగో ఎయిర్‌లైన్స్ గురువారం పెద్ద సంఖ్యలో విమానాలను రద్దు చేసింది
By - Knakam Karthik |
భారీ సంఖ్యలో ఇండిగో ఫ్లైట్స్ రద్దు..ఎయిర్‌పోర్టులలోనే ప్రయాణికుల పడిగాపులు
ఢిల్లీ: దేశవ్యాప్తంగా తన కార్యకలాపాలు దెబ్బతినడంతో ఇండిగో ఎయిర్‌లైన్స్ గురువారం పెద్ద సంఖ్యలో విమానాలను రద్దు చేసింది. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్‌తో పాటు పలు నగరాల్లో విమానాలు రద్దవడంతో వేలాది మంది ప్రయాణికులు విమానాశ్రయాల్లో ఇరుక్కున్నారు. తెల్లవారుజామున ఢిల్లీ నుండి బయలుదేరాల్సిన 30కి పైగా విమానాలు, హైదరాబాద్‌లో 33 ఫ్లైట్లు, ముంబైలో అనేక సేవలు రద్దయ్యాయి. మొత్తంగా గురువారం 170కి పైగా విమానాలు రద్దయ్యే అవకాశముందని విమానాశ్రయ వర్గాలు పేర్కొన్నాయి. బుధవారం మాత్రమే దిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్‌ల్లో కలిపి 200 విమానాలు రద్దయ్యాయి.
రోజుకు సుమారు 2,200 విమానాలు నడిపే ఇండిగో తమ కార్యకలాపాలు “గణనీయంగా అంతరాయం ఎదుర్కొంటున్నాయి” అని అంగీకరించింది. సాంకేతిక లోపాలు, శీతాకాల షెడ్యూల్ మార్పులు, అననుకూల వాతావరణం, దేశవ్యాప్త వైమానిక రద్దీ, అలాగే కొత్తగా అమలు చేసిన FDTL (Flight Duty Time Limitation) నిబంధనలు కలిసి ప్రతికూల ప్రభావం చూపాయని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. “తాత్కాలికంగా షెడ్యూల్ సర్దుబాట్లు చేస్తున్నాం. వచ్చే 48 గంటల్లో కార్యకలాపాలు సాధారణ స్థాయిలోకి వస్తాయి” అని ఇండిగో తెలిపింది.
పైలట్ల కొరత ప్రధాన సవాలు
90 దేశీయ, 40 అంతర్జాతీయ మార్గాల్లో సేవలందిస్తున్న ఇండిగోలో గందరగోళానికి ముఖ్య కారణంగా క్రూ, ముఖ్యంగా పైలట్ల కొరత నిలిచింది. నవంబర్‌లో అమల్లోకి వచ్చిన కొత్త FDTL నిబంధనల ప్రకారం పైలట్లకు ఎక్కువ విశ్రాంతి, తక్కువ రాత్రి ల్యాండింగ్‌లు తప్పనిసరి కావడంతో విమానాల సంఖ్య ప్రభావితమవుతోంది.
డీజీసీఏ విచారణ
ఇండిగో విమాన రద్దులపై విమాన నియంత్రణ సంస్థ డీజీసీఏ గురువారం అధికారులను వివరణకు పిలిచింది. బుధవారం విడుదల చేసిన నివేదికలో డీజీసీఏ నవంబరులో 1,232 విమానాలు రద్దయ్యాయి అని వెల్లడించింది. వీటిలో755 విమానాలు క్రూ/FDTL కారణంగా, 258 విమానాలు విమానాశ్రయం–ఎయిర్‌స్పేస్ పరిమితుల వల్ల, 92 ATC వైఫల్యం కారణంగా, 127 ఇతర కారణాలతో రద్దయ్యాయి. ఇక సమయపాలన (OTP) విషయంలో ఇండిగో పనితీరు కూడా దెబ్బతింది. అక్టోబర్‌లో 84.1% ఉన్న OTP నవంబర్‌లో *67.7%*కి పడిపోయిందని డీజీసీఏ పేర్కొంది.
కొత్త FDTL నిబంధనల ప్రభావం
కొత్త నిబంధనల ప్రకారం..వారానికి 48 గంటల విశ్రాంతి తప్పనిసరి, రాత్రి పని సమయాన్ని పెంపు, రాత్రి సమయంలో ల్యాండింగ్‌లను 6 నుంచి 2కి తగ్గింపు జరిగింది. ఈ నిబంధనలు దేశీయ ఎయిర్‌లైన్స్ ఎదురు తిరిగినా, ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు డీజీసీఏ రెండు దశలుగా అమలు చేసింది. రెండో దశ నవంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చింది.