దేశంలోనే అతి పెద్ద ఓపెన్ ఎయిర్ థియేటర్ ఆర్థిక రాజధాని ముంబైలో రెడీ అయ్యింది. ఇది దేశంలో తొలి ఓపెన్ ఎయిర్ రూఫ్ టాప్ థియేటర్. దీనిలో కారులో కూర్చొని సినిమా చూడొచ్చని రిలయన్స్ రిటైల్ తెలిపింది. ఈ నెల 5వ తేదీన ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో ఉన్న జియో వరల్డ్‌లో దీనిని ప్రారంభించనున్నారు. ఈ ఓపెన్ థియేటర్‌ను పీవీఆర్ సినిమా నిర్వహిస్తోంది. ఇది వీక్షకులకు సినిమాటిక్ అనుభూతిని కల్పిస్తుంది. ఈ థియేటర్‌లో 290 కార్లు పట్టే సామర్థ్యం ఉంది. 17.5 ఎకరాల విస్తీర్ణంలో జియో వరల్డ్ డ్రైవ్ ఉంది. ఈ డ్రైవ్‌లో నేషనల్, ఇంటర్నేషనల్ బ్రాండ్లు మాత్రమే దొరుకుతాయి.
రిలయన్స్ రిటైల్ డైరెక్టర్ ఇషా అంబానీ మాట్లాడుతూ.. ఆధునిక కస్టమర్ల షాపింగ్‌ను మరింత అద్భుతంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని అన్నారు. దీని నుండి పుట్టుకొచ్చిందే జియో వరల్డ్ అని చెప్పారు. ఇది వినోదం, ఆవిష్కరణలతో నిండి ఉందన్నారు. జియో వరల్డ్ డ్రైవ్‌తో తాము ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ రిటైల్, వినోద అనుభవాలను ముంబైకి తీసుకువస్తున్నామని చెప్పారు. ఇది కేవలం బ్రాండ్ లేదా స్థలం మాత్రమే కాదని.. మునుపెన్నడూ లేని విధంగా కస్టమర్లను ఆకర్షించేలా జియో వరల్డ్ డ్రైవ్‌ను రూపొందించామన్నారు.