మహిళల భద్రత కోసం సరికొత్త వర్షన్ రివాల్వర్.. 'ప్రబల్'
ప్రబల్.. ఇది సరికొత్త లాంగ్ రేంజ్ రివాల్వర్ పేరు. ఆగస్టు 18న ఇది విడుదల కానుంది.
By Medi Samrat Published on 15 Aug 2023 3:06 PM GMTప్రబల్.. ఇది సరికొత్త లాంగ్ రేంజ్ రివాల్వర్ పేరు. ఆగస్టు 18న ఇది విడుదల కానుంది. అంటే ఆయుధాల ప్రపంచంలో మరో కొత్త ఆయుధం చేరనుంది. కాన్పూర్‌లోని అడ్వాన్స్‌డ్ వెపన్స్ అండ్ ఎక్విప్‌మెంట్ ఇండియా లిమిటెడ్ కంపెనీ ఈ రివాల్వర్‌ను తయారు చేసింది. ఈ లైట్ వెయిట్ రివాల్వర్‌ను 50 మీటర్ల దూరం వరకు టార్గెట్ చేయవచ్చు. దీని బారెల్ పొడవు- 76 మి.మీ, మొత్తం పొడవు- 177.6 మిమీ ఉంటుందని కంపెనీ పేర్కొంది. ప్రస్తుతం రివాల్వర్‌ను 25 మీటర్ల దూరం వరకు మాత్రమే టార్గెట్ చేయవచ్చు. ప్రబల్ రివాల్వర్.. ఫైర్ రేంజ్ ఇతర రివాల్వర్ల కంటే ఎక్కువ అని కంపెనీ పేర్కొంది.
అడ్వాన్స్‌డ్ వెపన్స్ అండ్ ఎక్విప్‌మెంట్ ఇండియా లిమిటెడ్ డైరెక్టర్ ఎకె మౌర్య మాట్లాడుతూ.. బుల్లెట్‌ను లోడ్ చేయడానికి ఇంతకుముందు రివాల్వర్‌లను తిప్పాల్సి వచ్చేది.. ఇప్పుడు ఆ ఆవసరం లేదన్నారు. ఇది కాకుండా.. ప్రస్తుతం ఉన్న రివాల్వర్ పరిధి 20-25 మీటర్లు మాత్రమే. ప్రబల్ రివాల్వర్ చాలా తేలికైనది. బరువు 700 గ్రాములు మాత్రమే. దాని ట్రిగ్గర్ పుల్ అవుట్ కూడా చాలా సులభం. అంటే మహిళలు తమ భద్రత కోసం హ్యాండ్‌బ్యాగ్‌లో ఉంచుకుని కూడా దీనిని ఉపయోగించుకోవచ్చని తెలిపారు.
AWEIL(అడ్వాన్స్‌డ్ వెపన్స్ అండ్ ఎక్విప్‌మెంట్ ఇండియా లిమిటెడ్) అనేది కాన్పూర్‌లోని అర్మాపూర్‌లో రక్షణ ఉత్పత్తులను తయారు చేసే ప్రభుత్వ సంస్థ. ఇది పూర్వపు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్ (OFB).. ఎనిమిది కర్మాగారాలను కలిగి ఉంది. ప్రధానంగా భారత సాయుధ దళాలు, విదేశీ సైన్యాలు, దేశీయ పౌర అవసరాల కోసం చిన్న ఆయుధాలు, ఫిరంగి తుపాకులను తయారు చేస్తుంది.
ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్ ని ఏడు వేర్వేరు పీఎస్‌యూలుగా పునర్నిర్మించడం, కార్పొరేటైజేషన్ చేయడంలో భాగంగా ఈ సంస్థ 2021లో స్థాపించబడింది. ఈ ఏడాది రూ. 6,000 కోట్ల విలువైన డిఫెన్స్ ఉత్పత్తులను తయారు చేసేందుకు కంపెనీ ఆర్డర్లు పొందింది. వీటిలో భారత సైన్యం నుంచి 300 'సారంగ్' తుపాకుల ఆర్డర్లు, యూరోపియన్ దేశాల నుంచి రూ.450 కోట్ల విలువైన ఆర్డర్లు ఉన్నాయి.