రేపటి నుంచి భారతదేశ అభివృద్ధి పరుగులు పెడుతుంది: మోదీ

రేపటి నుంచి భారతదేశ అభివృద్ధి పరుగులు పెడుతుంది..అని భారత ప్రధాని మోదీ అన్నారు.

By -  Knakam Karthik
Published on : 21 Sept 2025 5:15 PM IST

National News, Delhi, India, Prime Minister Narendra Modi, national addresses

ఢిల్లీ: రేపటి నుంచి భారతదేశ అభివృద్ధి పరుగులు పెడుతుంది..అని భారత ప్రధాని మోదీ అన్నారు. దేశ ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. రేపటి నుంచి రెండో విడత జిఎస్టి సంస్కరణలు అమలు అవుతాయి. ఈ సంస్కరణల వల్ల పేద మధ్యతరగతి చిన్న వ్యాపారులు యువత రైతులు లబ్ధి పొందుతారు . రేపటి నుంచి భారతదేశ అభివృద్ధి పరుగులు పెడుతుంది. న్యూ జీఎస్టీ సేవింగ్ ఫెస్టివల్ . రేపటి నుంచి నవరాత్రుల ప్రారంభం అవుతున్న సందర్భంగా దేశ ప్రజలకు నవరాత్రి శుభాకాంక్షలు..అని ప్రధాని మోదీ అన్నారు.

కొత్త జీఎస్టీ రేట్లు అమల్లోకి రావడం వల్ల ప్రజలు తమకు ఇష్టమైన వస్తువులను తక్కువ ధరలకే సులభంగా కొనుగోలు చేయవచ్చని ప్రధాని తెలిపారు. "ఇది ప్రతి భారతీయుడికి ఒక జీఎస్టీ పొదుపు పండగలాంటిది," అని ఆయన అన్నారు. జీఎస్టీ రేట్ల తగ్గింపు నిర్ణయం వల్ల ముఖ్యంగా పేదలు, నూతన మధ్యతరగతి వర్గాలకు రెట్టింపు ప్రయోజనం కలుగుతుందని మోదీ పేర్కొన్నారు. ఈ సంస్కరణలు సామాన్యులు, రైతులు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈలు), మధ్యతరగతి కుటుంబాలు, మహిళలు, యువతకు ప్రత్యక్షంగా మేలు చేస్తాయని ఆయన వివరించారు.

'జీఎస్టీ 2.0'గా పిలుస్తున్న ఈ కొత్త విధానంలో పన్నుల నిర్మాణాన్ని సరళీకరించారు. దీని ప్రకారం 5 శాతం, 18 శాతం చొప్పున రెండు శ్లాబులు మాత్రమే ఉంటాయి. కేవలం అత్యంత విలాసవంతమైన, హానికరమైన వస్తువులపై మాత్రమే అదనంగా 40 శాతం పన్ను విధిస్తారు. సెప్టెంబర్ 4న ప్రభుత్వం ప్రకటించిన ఈ రేట్ల తగ్గింపు, 2017 జులైలో జీఎస్టీని ప్రవేశపెట్టిన తర్వాత జరిగిన అతిపెద్ద పరోక్ష పన్నుల సంస్కరణగా నిలుస్తోంది.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంపూర్ణ ఏకాభిప్రాయంతో 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఈ సంస్కరణలకు ఆమోదముద్ర పడింది. ఈ నిర్ణయం కేంద్ర, రాష్ట్రాల మధ్య ఉన్న సహకార స్ఫూర్తికి నిదర్శనమని ప్రధాని మోదీ నొక్కిచెప్పారు. కొత్త పన్నుల విధానం వల్ల వస్తువులు చౌకగా మారడంతో పాటు పరిశ్రమలకు ప్రోత్సాహం లభిస్తుందని, అంతిమంగా భారత ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు

Next Story