రైల్వేలను ప్రైవేటీకరించరట.. హామీ ఇచ్చారు..!
Indian Railways will never be privatised. కేంద్ర ప్రభుత్వం ఇటీవల పలు సంస్థలను ప్రైవేటీకరణ చేస్తున్నట్లుగా ప్రకటనలు చేస్తూ
By Medi Samrat Published on 16 March 2021 8:26 PM ISTకేంద్ర ప్రభుత్వం ఇటీవల పలు సంస్థలను ప్రైవేటీకరణ చేస్తున్నట్లుగా ప్రకటనలు చేస్తూ వస్తోంది. ఇప్పటికే నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకులను ప్రైవేటీకరించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఈ నిర్ణయాల పట్ల పెద్ద ఎత్తున నిరసనలు వస్తూ ఉండగా.. రైల్వేలను కూడా కేంద్రం ప్రైవేటీకరించనుందని ప్రచారం జరుగుతోంది.
ఈ ప్రచారంపై కేంద్ర రైల్వేశాఖ మంత్రి పియూష్ గోయల్ స్పందించారు. రైల్వేలను ఎన్నటికీ ప్రైవేటీకరించబోమని స్పష్టం చేశారు. రైల్వే శాఖ ఎప్పటికీ కేంద్ర ప్రభుత్వం వద్దే ఉంటుందని తెలిపారు. కానీ మరింత మెరుగైన కార్యకలాపాల కోసం రైల్వేల్లో ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల సంయుక్త భాగస్వామ్యంతోనే దేశం అత్యున్నత స్థాయిలో పురోగామి పథంలో పయనిస్తుందని తెలిపారు. ఇలా చేయడం వలన భారీగా ఉపాధి అవకాశాలు సృష్టించేందుకు వీలవుతుందని అన్నారు. లోక్ సభలో చర్చ సందర్భంగా పియూష్ గోయల్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇదిలావుంటే.. ప్రైవేటీకరణలో భాగంగా ఇప్పటికే పలు రైల్వే స్టేషన్లను సెలెక్ట్ చేశారని.. ఇకపై విమానాశ్రయాలను తలపించే స్థాయిలో రైల్వేలు ఉండనున్నాయని.. దేశవ్యాప్తంగా 90 రైల్వే స్టేషన్లను ప్రైవేటీకరించాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు హిందుస్తాన్ టైమ్స్ లో ఇటీవలే కథనం వచ్చింది. ఆ కథనం ప్రకారం రైల్వే స్టేషన్లలో ఎయిర్‌పోర్టు తరహా మౌలిక వసతులు కల్పించేందుకు భారతీయ రైల్వే ఆలోచన చేస్తోందని.. ఇందుకోసం 90 రైల్వే స్టేషన్లను నిర్వహించేందుకు ప్రైవేట్ కంపెనీలను ఆహ్వానించాలని భావిస్తోందని కథనాల్లో ఉంది. తమ ముందు గల మార్గాలను భారతీయ రైల్వే అన్వేషించడమే కాకుండా.. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు, సదుపాయాలు, భద్రతాపరమైన వసతులు కల్పించేందుకు రైల్వే స్టేషన్ల ప్రైవేటీకరణ గురించి ఆలోచిస్తోంది భారతీయ రైల్వే. దేశవ్యాప్తంగా 90 రైల్వే స్టేషన్లలో భద్రతాపరమైన వసతులు ఎలా కల్పించాలో సూచించాలంటూ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, అన్ని రైల్వే జోన్ల ప్రిన్సిపల్ చీఫ్ సెక్యూరిటీ కమిషనర్స్ నుంచి అభిప్రాయాలను కోరుతూ రైల్వే బోర్డు లేఖ రాసింది.