రైలు ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్.. జులై 1 నుంచి ఛార్జీలు పెంపు..!
త్వరలో రైళ్లలో ప్రయాణించే ప్రయాణికుల జేబులు గుల్ల కానున్నాయి
By Medi Samrat
త్వరలో రైళ్లలో ప్రయాణించే ప్రయాణికుల జేబులు గుల్ల కానున్నాయి. భారతీయ రైల్వేలు అన్ని AC మరియు నాన్-AC ఎక్స్‌ప్రెస్, మెయిల్ మరియు రెండవ తరగతి టిక్కెట్‌లను పెంచనున్నట్లు తెలుస్తుంది. ఇందుకు సంబంధించి రైల్వే కొత్త నిబంధనలు జూలై 1, 2025 నుండి అమలులోకి వచ్చే అవకాశం ఉంది.
భారతీయ రైల్వే కొత్త ఛార్జీల విధానాన్ని తీసుకురాబోతోంది. దీని ప్రకారం.. నాన్-ఎసీ కోచ్‌లలో కిలోమీటరుకు 1 పైసలు, ఎసీ కోచ్‌లలో కిలోమీటరుకు 2 పైసలు చొప్పున టిక్కెట్ల రేట్లను పెంచే అవకాశం ఉంది.
సమాచారం ప్రకారం.. ఇది సమీప ప్రయణాలు లేదా రోజువారీగా ప్రయాణించే వ్యక్తులపై ఈ పెంపు ప్రభావం చూపదు. 500 కిలోమీటర్ల వరకూ ప్రయాణించే వ్యక్తులు ఈ టికెట్ ధరల మార్పు నుండి తప్పించుకుంటారు. అయితే.. 500 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణిస్తే మాత్రం కిలోమీటరుకు రైలు ఛార్జీలు పెరిగే అవకాశం ఉంది.
సెకండ్ క్లాస్‌లో ప్రయాణించే వ్యక్తులు 500 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరాలకు కిలోమీటరుకు సగం ధర చెల్లించాల్సి ఉంటుంది. మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లలో నాన్-ఏసీ కోచ్‌లలో ప్రయాణించే ప్రయాణీకులకు కిలోమీటరుకు 1 పైస అదనంగా వసూలు చేస్తారు. అదే సమయంలో ఏసీ కోచ్‌లలో ప్రయాణించే ప్రయాణికులు కిలోమీటరుకు 2 పైసలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.
ఈ ఛార్జీల పెరుగుదల చాలా దూరం ప్రయాణించే ప్రయాణికులకు మాత్రమే వర్తిస్తుంది. 500 కిలోమీటర్ల లోపు ప్రయాణించే ప్రయాణికులకు పాత ధరకే టిక్కెట్లు లభిస్తాయి. అలాగే, ఈ మార్పులు ఎక్స్‌ప్రెస్, మెయిల్ రైళ్లలోని AC-నాన్-AC కోచ్‌లలో మాత్రమే అమలు చేయబడతాయి.
ఛార్జీల పెంపు ప్రతిపాదనను రైల్వే బోర్డు సిద్ధం చేసింది. ఈ మేరకు రైల్వే మంత్రిత్వ శాఖకు పంపారు. అయితే, ఈ ప్రతిపాదనను రైల్వే మంత్రిత్వ శాఖ ఇంకా ఆమోదించలేదు. మంత్రిత్వ శాఖ ఆమోదం తర్వాతే కొత్త ఛార్జీలు అమలులోకి వస్తాయి.