రోమియో హెలికాప్టర్లను అందుకున్న భారత్
Indian Navy gets first two MH-60 Romeo multi-role helicopters from US. అమెరికా నుండి భారత్ రెండు ఎంహెచ్-60ఆర్ రోమియో హెలికాప్టర్లను అందుకుంది
By Medi Samrat Published on 17 July 2021 9:12 AM GMTఅమెరికా నుండి భారత్ రెండు ఎంహెచ్-60ఆర్ రోమియో హెలికాప్టర్లను అందుకుంది. అమెరికాతో కుదుర్చుకున్న డీల్ లో భాగంగా భారత్ కు మొదటి బ్యాచ్ లో భాగంగా ఈ రెండు ఎంహెచ్-60ఆర్ రోమియో హెలికాప్టర్లు వచ్చి చేరాయి. సికోర్స్కీ MH-60ఆర్ మల్టీ రోల్ హెలికాప్టర్లను అమెరికా నౌకాదళం భారత్‌కు అప్పగించింది. తొలి దశలో భాగంగా రెండు హెలికాప్టర్లను ఇండియన్ నేవీ అందుకుంది.
సాన్‌డియాగోలో ఉన్న నార్త్ ఐల్యాండ్‌లోని నావెల్ ఎయిర్ స్టేషన్‌లో ఈ అప్పగింత కార్యక్రమం జరిగింది. భారతీయ నౌకాదళం 24 సికోర్స్కీ హెలికాప్టర్లకు ఆర్డర్ ఇచ్చింది. విదేశీ సైనిక ఒప్పందంలో భాగంగా లాక్‌హీడ్ మార్టిన్ సంస్థ వీటిని తయారు చేస్తోంది. సుమారు 2.4 బిలియన్ల డాలర్లు పెట్టి ఎంహెచ్-60ఆర్ హెలికాప్టర్ల ఒప్పందం కుదుర్చుకున్నారు.
🇮🇳🇺🇸 Friendship Touching the Skies! pic.twitter.com/QWsdkPsNTf
— Taranjit Singh Sandhu (@SandhuTaranjitS) July 17, 2021
రెండు ఎంహెచ్ -60 రోమియో హెలికాప్టర్లను అమెరికాలోని భారత రాయబారి తరంజిత్ సింగ్ సంధు, భారత నేవీ డిప్యూటీ చీఫ్ వైస్ అడ్మిరల్ రవ్నీత్ సింగ్ శాన్ డియాగోలోని యుఎస్ నేవీ బేస్ వద్ద అందుకున్నట్లు ఏఎన్ఐ మీడియా సంస్థ తెలిపింది. అన్ని వాతావరణాల్లోనూ సమర్థంగా పనిచేసే ఈ హెలికాప్టర్ల కొనుగోలు ఒప్పందంతో రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక రక్షణ బంధం మరింత దృఢమవుతుందని తరణ్ జీత్ సింగ్ సంధు అన్నారు. MH-60 రోమియో హెలీకాప్టర్ల లో మల్టీ-మోడ్ రాడార్లు, నైట్-విజన్ పరికరాలతో పాటు హెల్ఫైర్ క్షిపణులు, టార్పెడోలు మరియు ఖచ్చితమైన-గైడెడ్ ఆయుధాలు ఉన్నాయి.హెలికాప్టర్లు యుద్ధనౌకలు, డిస్ట్రాయర్లు, క్రూయిజర్లు, విమాన వాహక నౌకల నుండి పనిచేసేలా రూపొందించబడ్డాయి.