అమెరికా, బ్రెజిల్.. మన వెనుకే.. ఇలాగే పెరుగుతూ పోతే ఏమవుతుందో..?

India Tops In Covid Cases. కరోనా మహమ్మారి టెన్షన్ పెట్టిన దేశాల్లో అమెరికా, బ్రెజిల్ దేశాలు కూడా ఉన్నాయి.

By Medi Samrat  Published on  3 April 2021 8:26 AM GMT
అమెరికా, బ్రెజిల్.. మన వెనుకే.. ఇలాగే పెరుగుతూ పోతే ఏమవుతుందో..?

కరోనా మహమ్మారి టెన్షన్ పెట్టిన దేశాల్లో అమెరికా, బ్రెజిల్ దేశాలు కూడా ఉన్నాయి. ఈ రెండు దేశాల కంటే తక్కువగానే కరోనా మహమ్మారి కేసులు భారత్ లో నమోదయ్యేవి. కానీ ఇప్పుడు పరిస్థితి వేరేలా ఉంది. భారత్ అమెరికా, బ్రెజిల్ దేశాల కంటే కరోనా కేసుల్లో ముందుంది. భారత్ లో వ్యాక్సినేషన్‌ జరుగుతున్నా, మరోవైపు కరోనా కేసులు, మరణాలు భారీగా పెరుగుతున్నాయి. ఈ ఏడాదిలోనే రికార్డుస్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి.

కరోనా రోజువారీ కొత్త కేసుల్లో బ్రెజిల్, అమెరికాను భారత్‌ దాటేసి.. అత్యధిక కేసులు నమోదవుతున్న దేశాల్లో భారత్‌ తొలి స్థానానికి చేరుకుంది. దేశంలో శుక్రవారం 89,129 కరోనా కేసులు, 714 మరణాలు నమోదయ్యాయి. అమెరికాలో 69,986, బ్రెజిల్‌లో 69,662 పాజిటివ్‌ కేసులు వెలుగులోకి వచ్చాయి. గత సెప్టెంబర్‌ నుంచి భారత్‌లో ఇంత భారీ స్థాయిలో కేసులు వెలుగు చూడటం ఇదే తొలిసారి. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,23,92,260 దాటింది. దేశవ్యాప్తంగా కరోనా రికవరీ రేటు 93.36%, మరణాల రేటు 1.32%గా ఉంది.

పెరుగుతున్న కరోనా కేసుల కారణంగా లాక్ డౌన్ లపై కొందరు ముఖ్యమంత్రులు దృష్టి పెడుతూ ఉన్నారు. మహారాష్ట్రలో కరోనా ఉధృతి పెరుగుతుండడంతో మళ్లీ లాక్‌డౌన్‌ విధించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే చెప్పారు. ఇప్పటికిప్పుడు లాక్‌డౌన్‌ ప్రకటన చేయడం లేదన్నారు. లాక్‌డౌన్‌కు ప్రత్యామ్నాయం లభించకపోతే రానున్న రెండు మూడు రోజుల్లో కఠిన నిర్ణయం తీసుకోక తప్పదని స్పష్టం చేశారు. ఏదైనా మార్గం ఉంటే సూచించాలని ప్రజలను కోరారు. తాను కూడా నిపుణులతో దీనిపై చర్చిస్తున్నానని తెలిపారు. ప్రజల ప్రాణాలకంటే ఏదీ ముఖ్యం కాదన్నారు.


Next Story