ఇంధన ధరలను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అత్యవసర నిల్వల నుంచి దాదాపు 50 లక్షల బ్యారెళ్ల ముడి చమురును బయటకు తీసేందుకు కేంద్రం యోచిస్తున్నట్లు ఓ అధికారి చెప్పారు. ఇప్పటికే అమెరికా, జపాన్ సహా పెద్ద పెద్ద దేశాలు పెరుగుతున్న ధరలను కట్టడికి చేసేందుకు ఇదే వ్యూహాన్ని అమలు చేస్తున్నాయి. భారత్‌కు తూర్పు, పశ్చిమ తీరాల్లో మూడు వ్యూహాత్మక నిల్వ కేంద్రాలు ఉన్నాయి. వాటిలో దాదాపు 3.8 కోట్ల బ్యారెళ్ల ముడి చమురును నిల్వచేస్తున్నారు.
ఈ కేంద్రాల నుండి వచ్చే 10 రోజుల్లో 50 లక్షల బ్యారెళ్ల ముడి చమురును బయటకు తీయనున్నారని ఓ ప్రభుత్వాధికారి తెలిపారు. బయటకు తీసే చమురును మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్, హెచ్‌పీసీఎల్‌కు కేంద్రం విక్రయించనుంది. వ్యూహాత్మక నిల్వ కేంద్రాలకు ఈ రెండు రిఫైనరీలు అనుసంధానమై ఉన్నాయి. ఆ తర్వాత మరింత చమురును కూడా విడుదల చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి తర్వలోనే అధికారిక ప్రకటన వెలువడే ఛాన్స్ ఉందని సమాచారం.