కేంద్రం సరికొత్త ఆలోచన.. ఇక టోల్ గేట్లు ఉండవు
India To Be Toll Free By 2022 – Toll Collection Will Be GPS Based. జాతీయ రహదారులపై ప్రయాణించేటప్పుడు టోల్ గేట్లు
By Medi Samrat Published on 18 Dec 2020 10:10 AM GMTజాతీయ రహదారులపై ప్రయాణించేటప్పుడు టోల్ గేట్‌లు దర్శనమిస్తాయి. కాస్త ఎక్కువ దూరం ప్రయాణిస్తే రెండు లేదా మూడు కనిపిస్తాయి. టోల్‌గేట్ వద్ద ఆగి రుసం చెల్లించి ప్రయాణించాలి. ఇక పండగలు వచ్చినప్పుడు సరే సరీ.. కిలోమీటర్ల మేర టోల్‌గేట్ల వద్ద వాహనాలు బారులు తీరుతాయి. దీని వల్ల చాలా సమయం వృధా అవుతుంది. ఇందుకు పరిష్కారంగా ఇటీవల ఫాస్ట్‌ట్యాగ్ అనే కొత్త సదుపాయాన్ని ప్రారంభించిన కేంద్రం జీపీఎస్ వ్వవస్థను తీసుకొచ్చి మొత్తం టోల్ గేట్లనే తీసేయాలని నిర్ణయించింది.
హమ్మయ్య ఇక టోల్ రుసం తప్పినట్లే అని మీరు భావించనక్కరేదు. జీపీఎస్ ఆధారంగా టోల్ రోడ్‌లను వినియోగించుకున్న వాహనదారుల నుంచి నేరుగా టోల్ ఛార్జీలుగా ఆన్‌లైన్ పద్ధతిలో వసూలు చేస్తారు. ఇందుకోసం రష్యా దేశంలో వాడుతున్న సాంకేతికతను ఉపయోగించుకోవాలని కేంద్రం ప్రభుత్వం డిసైడ్ అయ్యింది.
వచ్చే రెండేళ్లలో దేశంలో టోల్ గేట్లు ఉండవని కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. రష్యా సహకారంతో టోల్ గేట్ల స్థానంలో జీపీఎస్ వ్యవస్థ ప్రవేశపెడుతామని ప్రకటించారు. జీపీఎస్ ఆధారంగా.. వాహనాల రాకపోకలను బట్టి వినియోగదారు బ్యాంకు ఖాతా నుంచి నేరుగా టోల్ మొత్తాన్ని మినహాయించుకొనే కొత్త వ్యవస్థ రానుందని తెలిపారు. ఇప్పుడు అన్ని వాణిజ్య వాహనాలూ వెహికిల్ ట్రాకింగ్ సిస్టంతో వస్తున్నందున వాటికి ఎలాంటి సమస్య ఉండదని వెల్లడించారు. పాత వాహనాల్లో జీపీఎస్ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక రచిస్తోందని.. వచ్చే మార్చి నాటికి దేశంలో టోల్ వసూళ్లు రూ.34 వేల కోట్లకు చేరుతాయని అంచనా వేస్తున్నామని మంత్రి చెప్పారు. అన్ని టోల్ వసూళ్లకు జీపీఎస్ టెక్నాలజీని ఉపయోగించడం వల్ల వచ్చే ఐదేళ్లలో టోల్ ఆదాయం రూ.1.34 లక్షల కోట్లకు చేరుతుందని కేంద్ర మంత్రి గడ్కరీ ఆశాభావం వ్యక్తం చేశారు.