132 రోజుల తర్వాత ఇదే మొదటిసారి.. 30వేల దిగువకు కొత్త కేసులు
India Reported 29,689 New Corona Cases Today. దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. నిన్నటితో పోలిస్తే నేడు
By Medi Samrat Published on 27 July 2021 5:33 AM GMT
దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. నిన్నటితో పోలిస్తే నేడు కేసుల సంఖ్య తగ్గింది. గడిచిన 24 గంటల్లో 17,20,110 కరోనా శాంపిళ్లను పరీక్షించగా.. 29,689 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం ఉదయం విడుదల చేసిన బులిటెన్‌లో వెల్లడించింది. దీంతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3.14కోట్లకు చేరింది. నిన్న ఒక్క రోజే 415 మంది కరోనాతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకుప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,21,382 కి పెరిగింది.
నిన్న 42,363 బాధితులు కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 3.06 కోట్లకు చేరింది. ప్రస్తుతం దేశంలో 3,98,100 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జాతీయ రికవరీ రేటు 97.39శాతం, వీక్లీ పాజిటివిటీ రేటు 2.33శాతంగా ఉందని తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు 1.73 శాతంగా ఉందని ఆరోగ్యశాఖ పేర్కొంది. దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోంది. నిన్న ఒక్క రోజే 66,03,112 మందికి టీకా అందించగా.. మొత్తంగా ఇప్పటి వరకు 44 కోట్లకు పైగా టీకా డోసులు పంపిణీ అయ్యాయి.