భారత్ లో కొత్త రకం కరోనా.. మార్చి నెలలోనే ఉందట..!

India noticed ‘super-spreading’ Covid strain in March. కొత్త రకం కరోనా రూపాంతరం చెందిందంటూ ప్రపంచం మొత్తం తెగ షాక్ అవుతూ

By Medi Samrat  Published on  26 Dec 2020 11:29 AM GMT
భారత్ లో కొత్త రకం కరోనా.. మార్చి నెలలోనే ఉందట..!

కొత్త రకం కరోనా రూపాంతరం చెందిందంటూ ప్రపంచం మొత్తం తెగ షాక్ అవుతూ ఉంది. అయితే భారత్ లో కొత్త రకం కరోనా కనిపించి చాలా నెలలే అవుతోందని ఉన్నతాధికారులు చెబుతూ ఉన్నారు. ఈ ఏడాది మార్చిలోనే దేశంలోకి ప్రవేశించినట్టు కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్) అనుబంధ సంస్థ ఇనిస్టిట్యూట్ ఆఫ్ జీనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ (ఐజీఐబీ) డైరెక్టర్ అనురాగ్ అగర్వాల్ సంచలన విషయాలను వెల్లడించారు.

వైరస్‌కు భిన్నమైన రకాలు మార్చిలోనే శాస్త్రవేత్తలు గుర్తించారని అన్నారు. వీటిలో ఒక రకాన్ని సూపర్ స్ప్రెడర్‌గా గుర్తించి దానికి 'ఎ4' అని పేరు పెట్టారని తెలిపారు. హైదరాబాద్, ఢిల్లీ, కోల్‌కతాలలో సేకరించిన నమూనాల్లో ఈ 'ఎ4' మ్యుటేషన్ వైరస్ బయటపడిందని.. రోగ నిరోధక వ్యవస్థ బలంగా ఉండడంతో జూన్ నాటికే ఈ సూపర్ స్ప్రెడర్ అంతమైందని అన్నారు అగర్వాల్.

ఇక కొత్త రకం కరోనా గురించి ఆందోళన అవసరం లేదని ఆలిండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) డైరెక్టర్, కొవిడ్ జాతీయ టాస్క్ ఫోర్స్ సభ్యుడు డాక్టర్ రణ్ దీప్ గులేరియా చెబుతున్నారు. దేశంలో పది నెలల్లో కరోనా వైరస్ ఎన్నో రూపాలు మార్చుకుందని, అది సాధారణంగా జరిగేదేనని అన్నారు. నెలకు సగటున వైరస్ లో రెండు ఉత్పరివర్తనాలు జరిగాయని.. వైరస్ మారినా అది సోకినప్పుడు కలిగే లక్షణాల్లో మాత్రం ఎలాంటి మార్పులు లేవన్నారు. కరోనా చికిత్స కూడా మారలేదని, మార్చాల్సిన అవసరమూ లేదని హామీ ఇచ్చారు.


Next Story
Share it