భారతదేశం ధర్మసత్రం కాదు: సుప్రీం కోర్టు
ప్రపంచంలోని శరణార్థులందరికీ ఆశ్రయం కల్పించడానికి భారతదేశం ఏమీ ధర్మసత్రం కాదని సుప్రీంకోర్టు ఓ శ్రీలంక జాతీయుడిపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
By Medi Samrat
ప్రపంచంలోని శరణార్థులందరికీ ఆశ్రయం కల్పించడానికి భారతదేశం ఏమీ ధర్మసత్రం కాదని సుప్రీంకోర్టు ఓ శ్రీలంక జాతీయుడిపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. భారతదేశం ప్రపంచం నలుమూలల నుండి వచ్చే శరణార్థులకు ఆశ్రయం కల్పించగల ధర్మశాల కాదని, శ్రీలంక జాతీయుడు ఆశ్రయం కోసం చేసిన విజ్ఞప్తిని తిరస్కరిస్తూ సుప్రీంకోర్టు పేర్కొంది. శ్రీలంకలో ఒకప్పుడు క్రియాశీలకంగా ఉన్న ఉగ్రవాద సంస్థ లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలం (LTTE)తో సంబంధం ఉన్నట్లు అనుమానించి 2015లో అరెస్టు చేసిన శ్రీలంక జాతీయుడు దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ కె వినోద్ చంద్రన్ లతో కూడిన ధర్మాసనం విచారిస్తోంది.
2018లో, ట్రయల్ కోర్టు చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం కింద అతన్ని దోషిగా నిర్ధారించి 10 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. 2022లో, మద్రాస్ హైకోర్టు అతని శిక్షను ఏడు సంవత్సరాలకు తగ్గించింది, కానీ అతని శిక్ష ముగిసిన వెంటనే దేశం విడిచి వెళ్లాలని, అతని బహిష్కరణకు ముందు శరణార్థి శిబిరంలో ఉండాలని సూచించింది.
సదరు శ్రీలంక తమిళ జాతీయుడు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. తాను వీసాపైనే భారత్‌కు వచ్చానని, స్వదేశంలో తనకు ప్రాణహాని ఉందని, తన భార్యాపిల్లలు ఇక్కడే స్థిరపడ్డారని తన పిటిషన్‌లో పేర్కొన్నాడు. శిక్ష పూర్తయి దాదాపు మూడేళ్లు కావస్తున్నా తనను ఇంకా నిర్బంధంలోనే ఉంచారని తెలిపాడు. పిటిషనర్ వాదనలపై జస్టిస్ దత్తా తీవ్రంగా స్పందించారు. భారత్ ధర్మసత్రం కాదని అన్నారు. పిటిషనర్‌ను చట్ట ప్రకారమే నిర్బంధంలోకి తీసుకున్నారని, కాబట్టి ఆర్టికల్ 21 ఉల్లంఘన జరగలేదని స్పష్టం చేశారు.