చైనా మ్యాప్ పై అభ్యంతరం వ్యక్తం చేసిన భారత్
చైనా విడుదల చేసిన తాజా మ్యాప్‌లో అరుణాచల్ ప్రదేశ్, అక్సాయ్ చిన్ ప్రాంతాలను
By Medi Samrat Published on 29 Aug 2023 9:00 PM ISTచైనా విడుదల చేసిన తాజా మ్యాప్‌లో అరుణాచల్ ప్రదేశ్, అక్సాయ్ చిన్ ప్రాంతాలను చేర్చడంపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మంగళవారం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పొరుగు దేశానికి అలాంటి మ్యాప్‌లను విడుదల చేసే 'అలవాటు' ఉందని అన్నారు. చైనా తన మ్యాప్‌లలో ఇతర దేశాల భూభాగాలను చేర్చడం కొత్తేమీ కాదని అన్నారు. "చైనా తమది కాని భూభాగాలతో మ్యాప్‌లను బయటపెట్టింది. ఇది చైనాకు బాగా అలవాటు. కేవలం భారతదేశంలోని కొన్ని ప్రాంతాలతో మ్యాప్‌లను ఉంచినంత మాత్రాన ఇతర విషయాలు మారవు. అసంబద్ధమైన వాదనలు చేయడం వల్ల ఇతరుల భూభాగాలు మీవి కావని మా ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది. ఆ ప్రాంతాలన్నీ భారత్ భూభాగం కిందకే వస్తాయి " అని జైశంకర్ NDTVకి చెప్పారు.
అరుణాచల్ ప్రదేశ్, అక్సాయ్ చిన్ ప్రాంతం, తైవాన్, వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంతో సహా పలు వివాదాస్పద ప్రాంతాలను చైనా తన "ప్రామాణిక మ్యాప్" కు సంబంధించిన 2023 ఎడిషన్‌ను అధికారికంగా విడుదల చేయగా.. జైశంకర్ తీవ్ర విమర్శలు చేశారు. భారత్ లోని అరుణాచల్ ప్రదేశ్, అక్సాయ్ చిన్ భూభాగాలను తమ అంతర్భాగంగా చూపిస్తూ చైనా కొత్త మ్యాప్ విడుదల చేసింది. భారత భూభాగాలతో పాటు తైవాన్ ను, సౌత్ చైనా సముద్రాన్నీ తమదే అని మ్యాప్ లో తెలిపింది చైనా. ఈ వివరాలను చైనా అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్ వెల్లడించింది. సౌత్ చైనా సముద్రంలో తమకూ వాటా ఉందంటూ వియత్నాం, ఫిలిప్పీన్, మలేసియా, బ్రూనై, తైవాన్ వాదిస్తున్నా పట్టించుకోకుండా చైనా తమదేనని మ్యాప్ విడుదల చేసింది.