భారత్‌లో కూడా అలాంటి ఘటనలు జరిగే అవకాశం..!
ఆస్ట్రేలియాలోని సిడ్నీ బాండీ బీచ్‌లో ఉగ్రదాడి నేపథ్యంలో దేశంలోని నిఘా వర్గాలు అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేశాయి.
By - Medi Samrat |
ఆస్ట్రేలియాలోని సిడ్నీ బాండీ బీచ్‌లో ఉగ్రదాడి నేపథ్యంలో దేశంలోని నిఘా వర్గాలు అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేశాయి. నూతన సంవత్సర వేడుకలు సమీపిస్తున్న తరుణంలో ఐసిస్ ప్రేరేపిత ఉగ్రవాదులు పలు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకోవచ్చని హెచ్చరించాయి. భారత నిఘా సంస్థలు (ఐబీ) భద్రతను కట్టుదిట్టం చేయాలని రాష్ట్రాలకు సూచించాయి. సిడ్నీ దాడిని ఒక ఉదాహరణగా చూపి, ఐసిస్ అనుబంధ గ్రూపులు ఆన్‌లైన్‌లో యువతను రెచ్చగొట్టే ప్రమాదం ఉందని అధికారులు భావిస్తున్నారు. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ర్యాడికలైజేషన్ డ్రైవ్‌లు కొనసాగుతున్నాయని పలు నివేదికలు చెబుతున్నాయి. నూతన సంవత్సర వేడుకలకు భారీగా జనం తరలివచ్చే గోవా వంటి రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి సారించాలని నిఘా వర్గాలు తెలిపాయి.
ఆస్ట్రేలియాలోని బౌండీ బీచ్‌లో కాల్పులకు పాల్పడ్డ ఉగ్రవాది సాజిద్ అక్రమ్‌కు హైదరాబాద్‌తో సంబంధాలు ఉన్నట్లు ఆస్ట్రేలియా పోలీసులు గుర్తించారు. అతడి దగ్గర హైదరాబాద్ పాస్‌పోర్టు లభ్యమైంది. ఈ నేపథ్యంలో సాజిద్ అక్రమ్ గురించి కీలక విషయాలను డీజీపీ శివధర్ రెడ్డి వెల్లడించారు. సాజిద్ అక్రమ్ హైదరాబాద్‌లో బీకామ్ పూర్తి చేసి స్టూడెంట్ వీసాపై 1998 నవంబర్‌లో ఆస్ట్రేలియాకు వెళ్లాడు. అక్కడే యూరప్‌లోని ఇటలీకి చెందిన వెనీరా గ్రాసోను వివాహం చేసుకున్నాడు. వారికి ఒక కుమారుడు, ఒక కూతురు. ఆస్ట్రేలియా వెళ్లిన తర్వాత 2001లో తన వీసాను పార్టనర్ వీసాగా మార్చుకున్నాడు.. 2002లో రెసిడెంట్ వీసాను పొందాడు. సాజిద్ ఇప్పటికీ ఇండియన్ పాస్‌పోర్టు కలిగి ఉన్నాడని. అతని పిల్లలకు మాత్రం ఆస్ట్రేలియా పౌరసత్వం ఉందని డీజీపీ వెల్లడించారు. సాజిద్ గడిచిన 25 ఏళ్లలో ఆరుసార్లు మాత్రమే వచ్చాడు. 2017లో తండ్రి చనిపోయిన సమయంలో ఒకసారి హైదరాబాద్ వచ్చి వెళ్లాడని పేర్కొన్నారు. 2022లో హైదరాబాద్‌లోని టోలీచౌకీలో ఉన్న ఆస్తులను అమ్ముకొని వెళ్లినట్లు తెలిపారు. తెలంగాణలో సాజిద్‌పై ఎలాంటి క్రైమ్ రికార్డ్స్ లేవని వెల్లడించారు.