భారత్ లో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతూ ఉండగా.. ఇతర దేశాలకు భారత్ కరోనా వ్యాక్సిన్ కూడా పంపుతోంది. ఇతర దేశాలకు వ్యాక్సిన్లను పంపకుండా మొత్తం భారత్ లోనే వినియోగించాలనే డిమాండ్ లు కూడా మొదలయ్యాయి. కానీ భారత్ ఇతర దేశాలకు ఆపన్న హస్తం అందిస్తోంది. కొన్ని దేశాలకు ఉచితంగా వ్యాక్సిన్లను పంపిస్తూ ఉండగా.. మరికొన్ని దేశాలకు తక్కువ ధరకే అమ్ముతూ ఉంది. తాజాగా విదేశాంగ శాఖ వ్యాక్సిన్ ను ఇతర దేశాలకు పంపడంపై కీలక వ్యాఖ్యలు చేసింది.
విదేశాంగశాఖ అధికారులు మాట్లాడుతూ ఇప్పటికే 80కి పైగా దేశాలకు 644 లక్షల టీకా డోసులను సరఫరా చేశామన్నారు. కరోనా నిరోధక టీకా ఎగుమతులపై ఇప్పటి వరకు ఎలాంటి నిషేధం విధించలేదని స్పష్టం చేశారు. 'వ్యాక్సిన్ మైత్రి' పేరిట భారత్ ఇతర దేశాలకు టీకా అందించే కార్యక్రమం విజయవంతమైందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బక్షి తెలిపారు. ఈ కార్యక్రమం అందించిన 644 లక్షల డోసుల్లో 104 లక్షల డోసుల్ని గ్రాంట్ కింద, 357 లక్షల డోసుల్ని వాణిజ్యపరమైన ఒప్పందం మేరకు, 182 లక్షల డోసులు కొవాక్స్ కార్యక్రమం కింద అందించినట్లు వివరించారు. భారత్‌లో తయారైన టీకాలకు డిమాండ్ ఉందని, అందుకే ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల వారు కోరారన్నారు. దేశీయ అవసరాలను దృష్టిలో ఉంచుకునే ఇతర దేశాలకు సరఫరా చేస్తామని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని భాగస్వామ్య దేశాలు అర్థం చేసుకుంటాయని భావిస్తున్నామన్నారు.