ఫ్రాన్స్ నుంచి 114 రాఫెల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసే భారీ ప్రతిపాదనకు భారత్ ఆమోదం తెలిపింది. ఈ ప్రాథమిక ప్రతిపాదనకు డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ (డీఏసీ) గురువారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ డీల్ అంచనా విలువ రూ.3.25 లక్షల కోట్లు. ఈ ఒప్పందం ఫ్రెంచ్ కంపెనీ డసాల్ట్ ఏవియేషన్‌తో ఉంటుంది. త్వరలో రెండు దేశాల మధ్య వాణిజ్య, సాంకేతిక చర్చలు కూడా ప్రారంభమవుతాయి.
భారత వైమానిక దళం (IAF) యొక్క స్క్వాడ్రన్ బలం 29కి పడిపోయిన సమయంలో ఈ నిర్ణయం వెలువడింది. మంజూరైన బలం 42. గత కొన్ని నెలల్లో పాత విమానాల రిటైర్మెంట్ కారణంగా భారీ ప్రతిపాదనకు ప్రాధాన్యత సంతరించుకుంది. యుద్ధవిమానాలను కొనుగోలు చేసేందుకు రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలోని డిఫెన్స్ కౌన్సిల్ ఆమోదించినట్లు ప్రభుత్వవర్గాలు వెల్లడించాయి. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ ఈ నెల 18న భారత పర్యటనకు రానున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ఢీల్ ఆమోదం లభించినట్లు తెలుస్తుంది. ఈ 114లో 88 సింగిల్ సీట్, 26 ట్విన్ సీట్ వేరియంట్లు ఉన్నట్లు తెలుస్తుంది. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా స్థానికంగా తయారీ, అసెంబుల్ వంటి వాటి కోసం ఫ్రాన్స్‌కు చెందిన రఫేల్ మాతృ సంస్థ డసాల్ట్ ఏవియేషన్.. భారత్‌లోని ప్రయివేటు రంగ సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకోనున్నట్లు తెలుస్తుంది.