మళ్లీ చెబుతున్నా.. నీరు, రక్తం కలిసి ప్రవహించవు: ప్రధాని మోదీ
ఇవాళ 140 కోట్ల మంది భారతీయులు పండుగ చేసుకునే రోజని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై జాతీయ జెండా ఎగురవేసిన అనంతరం ఆయన మాట్లాడారు.
By అంజి
మళ్లీ చెబుతున్నా.. నీరు, రక్తం కలిసి ప్రవహించవు: ప్రధాని మోదీ
ఇవాళ 140 కోట్ల మంది భారతీయులు పండుగ చేసుకునే రోజని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై జాతీయ జెండా ఎగురవేసిన అనంతరం ఆయన మాట్లాడారు. ఇది సైమక్య భావనతో దేశం ఉప్పొంగే సమయమన్నారు. ప్రతి ఇంటా మువ్వన్నెల జెండా ఎగిరే సమయమని, కోట్లాది మంది త్యాగాలతో స్వాతంత్ర్యం సిద్ధించిందన్నారు. దేశ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్నామని స్పష్టం చేశారు. ఒకే దేశం.. ఒకే రాజ్యాంగం కలను సాకారం చేశామన్నారు. ప్రపంచంలోని మన శ్రేయోభిలాషులందరికి అభినందనలు అని అన్నారు. ప్రకృతి విపత్తుల్లో అసువులుబాసిన వారికి నివాళులర్పిస్తున్నానన్నారు.
ఆపరేషన్ సింధూర్‌లో ధైర్యసాహసాలు ప్రదర్శించిన వీర జవాన్లకు సెల్యూట్ చేస్తున్నానని, వీరజవాన్లకు సెల్యూట్ చేసే అవకాశం తనకు దక్కిందని ప్రధాని అన్నారు. పహల్గాంలో మతం పేరుతో దాడి చేసిన ఉగ్రవాదులకు గట్టి గుణపాఠం చెప్పామన్నారు. పహల్గాం ఉగ్రదాడులకు ఆపరేషన్ సింధూర్‌తో సమాధానం చెప్పామన్నారు. ఆపరేషన్ సింధూర్‌లో త్రివిధ దళాలకు సంపూర్ణ స్వేచ్ఛనిచ్చామని, లక్ష్యం, సమయం ఎంచుకునే స్వేచ్ఛ త్రివిధ దళాలకే ఇచ్చామని తెలిపారు. ఉగ్రవాదం, ఉగ్రవాదాన్ని సమర్థించే వారిని వేర్వేరుగా చూడబోమన్నారు. ఉగ్రవాదం మానవాళి మనుగడకే ముప్పు అని అన్నారు. న్యూక్లియర్ బెదిరింపులకు భారత్ భయపడదనే విషయం తేల్చి చెప్పామన్నారు. శత్రుమూకలను ఎప్పుడు ఎలా మట్టుబెట్టాలో సైన్యం నిర్ణయిస్తుందన్నారు. లక్ష్యాన్ని చేసే సమయాన్ని కూడా సైన్యమే నిర్దేశిస్తుందన్నారు.
మళ్లీ చెబుతున్నా.. నీరు, రక్తం కలిసి ప్రవహించవు అని ప్రధాని మోదీ మరో సారి ఉద్ఘాటించారు. సింధూ జలాల ఒప్పందంపై మరో మాట లేదన్నారు. సింధూ జలాలను భారత భూభాగానికి మళ్లించాలన్న ఆలోచనలో మార్పు లేదన్నారు. నీటి కొరత ఉన్న ప్రాంతాలకు సింధూ జలాలను తరలిస్తామన్నారు. సింధూ జలాలపై సంపూర్ణాధికారం భారత్‌ది, భారత రైతులదని ప్రధాని మోదీ పేర్కొన్నారు. సింధూ జలాల ఒప్పందం పునరుద్ధరణ ఇక ఎప్పటికీ జరగదన్నారు. ఇక ఎప్పటికీ సింధూ జలాలపై చర్చల ప్రసక్తే లేదన్నారు. స్వాభిమాన భారతం.. స్వయం సమృద్ధివైపు నడుస్తోందన్నారు. అనేక సవాళ్లు ఎదుర్కొన్న భారత్.. నేడు స్వయం సమృద్ధి దిశగా అడుగులు వేస్తోందన్నారు. తిండిగింజల కోసం ఇబ్బంది పడిన భారత్.. నేడు ప్రపంచానికి ఎగుమతి చేస్తోందని ప్రధాని మోదీ తెలిపారు. ఎన్ని ఇబ్బందులొచ్చినా స్వయం సమృద్ధిపై వెనకడుగు లేదన్నారు.