ఇబ్బంది పెడుతున్న ఇన్‌కం టాక్స్‌ పోర్టల్.. ఏంటి పరిస్థితి..?

Income Tax Portal. ఐటీఆర్ ఫైల్ చేయాలంటే ఎంతో కష్టమవుతోంది. లాగిన్ అవ్వడం కుదరడం లేదు..

By Medi Samrat  Published on  23 Aug 2021 5:06 AM GMT
ఇబ్బంది పెడుతున్న ఇన్‌కం టాక్స్‌ పోర్టల్.. ఏంటి పరిస్థితి..?

ఐటీఆర్ ఫైల్ చేయాలంటే ఎంతో కష్టమవుతోంది. లాగిన్ అవ్వడం కుదరడం లేదు.. ఓటీపీలు రావడం లేదు.. ఇలా చాలానే ఇబ్బందులు ఉన్నాయి. కొత్త ఐటీ (ఆదాయ పన్ను) పోర్టల్‌ను సాంకేతిక లోపాలు వెన్నాడుతూనే ఉన్నాయి. రెండు రోజులుగా పోర్టల్‌ పూర్తిగా అందుబాటులోనే లేకుండా పోవడంతో కేంద్రం ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుంది. ప్రారంభించి రెండున్నర నెలలు అవుతున్నా ఇలా సమస్యలు కొనసాగుతుండటంపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు సోమవారం వచ్చి వివరణ ఇవ్వాలంటూ పోర్టల్‌ను రూపొందించిన టెక్నాలజీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ సీఈవో సలిల్‌ పరేఖ్‌ను కేంద్ర ఆర్థిక శాఖ ఆదేశించింది.

నిర్వహణ పనుల కోసం ట్యాక్స్‌ పోర్టల్‌ అందుబాటులో ఉండదని ట్విటర్‌లో శనివారం ఇన్ఫోసిస్‌ ట్వీట్‌ చేసింది. అత్యవసర మెయింటెనెన్స్‌ పనులు ఇంకా కొనసాగుతున్నాయని, పూర్తయ్యాక అప్‌డేట్‌ చేస్తామంటూ ఆదివారం మరో ట్వీట్‌ చేసింది. 'కొత్త ఈ–ఫైలింగ్‌ పోర్టల్‌ను ప్రారంభించి 2.5 నెలలు అయిపోతున్నప్పటికీ పోర్టల్‌లో సమస్యలను ఇంకా ఎందుకు పరిష్కరించలేదనే అంశంపై ఆగస్టు 23న (సోమవారం) కేంద్ర ఆర్థిక మంత్రికి వివరణ ఇవ్వాలని ఇన్ఫోసిస్‌ సీఈవో సలిల్‌ పరేఖ్‌ను కేంద్ర ఆర్థిక శాఖ ఆదేశించింది. ఆగస్టు 21 నుంచి ఏకంగా పోర్టల్‌ అందుబాటులోనే లేదు' అని ఆదాయ పన్ను శాఖ ట్విటర్‌లో ట్వీట్‌ చేసింది.


ప్రభుత్వ ప్రాజెక్టులకు సంబంధించి ఇన్ఫోసిస్‌ చేసిన రెండో ప్రాజెక్టు ఇదని తెలుస్తోంది. మొదటిది జీఎస్‌టీ పోర్టల్‌ కాగా ఇప్పుడు ఇన్‌కం ట్యాక్స్‌ పోర్టల్‌. రెండు వరుస వైఫల్యాలనేవి కాకతాళీయంగా అనుకోవడానికి లేదనే విమర్శలు వస్తున్నాయి. రిటర్నుల ప్రాసెసింగ్‌ వ్యవధిని 63 రోజుల నుంచి ఒక్క రోజుకు తగ్గించడం, రిఫండ్‌ల వేగవంతం లక్ష్యంగా కొత్త ఐటీ పోర్టల్‌ అభివృద్ధికి రూ.4,242 కోట్ల ప్రాజెక్టుకు కేంద్రం 2019 జనవరి 19న ఆమోదముద్ర వేసింది. ఈ ఏడాది జూన్‌ 7న పోర్టల్‌ను ప్రభుత్వం ప్రారంభించింది. అప్పట్నుంచీ వెబ్ సైట్ పని తీరు అంతంత మాత్రంగానే ఉంది. ఇప్పుడు ఏకంగా రెండు రోజులు అందుబాటులో లేకుండా పోయింది.


Next Story
Share it