శివసేన ఊహించని విధంగా తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని టార్గెట్ చేసింది. గోవా ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలను డబ్బుతో కొనాలని ఆమె ప్రయత్నాలు చేస్తోందని సామ్నా వేదికగా శివసేన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మమతా బెనర్జీ ఇలా చేయడం సరికాదని, ఇలా చేయడం వల్ల బీజేపీ లాభపడుతుందని శివసేన అభిప్రాయపడింది. కాంగ్రెస్ వ్యతిరేకంగా పనిచేయాలని మమత నిర్ణయం తీసుకోవడం రాజకీయపరంగా తప్పుడు నిర్ణయమని, కాంగ్రెస్‌ను తుడిచిపెట్టడానికి బీజేపీ ఇప్పటికే పావులు కదుపుతోందని, ఇలాంటి సమయంలో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పోరాడతామని చెప్పడం సరైన విధానం కాదని శివసేన అభ్యంతరం వ్యక్తం చేసింది.
మమత చేస్తున్న రాజకీయాలు బీజేపీకే లాభం చేకూరుస్తాయని సామ్నాలో విమర్శించారు. ఆప్, తృణమూల్ పార్టీలు క్రిస్టియన్ ఓట్లపై కన్నేశాయని, కానీ క్రిస్టియన్లు ఎప్పుడూ కాంగ్రెస్ వైపే ఉన్నారని తెలిపింది. కాంగ్రెస్ మీద కోపంతో కొందరు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరిపోయారని, అక్కడ టిక్కట్లు రావని తెలిసి, తిరిగి కాంగ్రెస్ గూటికి రావడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించింది. స్వార్థ ప్రయోజనాల కోసం బీజేపీ అటు అధికారాన్ని, ఇటు డబ్బును దుర్వినియోగం చేస్తోందని.. దాదాపు 10 సంవత్సరాల పాటు బీజేపీ గోవాను ఏలిందని, కానీ అధికారం కోసం కావాల్సిన మెజారిటీని ఎప్పుడూ సంపాదించుకోలేకపోయిందని విమర్శలు చేసింది.