భార్య మృతదేహాన్ని ఇంట్లో పూడ్చిన భర్త.. చివరకు
In Madhya Pradesh, a husband buried his wife's body at home. తన భార్యపై ఉన్న ప్రేమతో ఆమె మృతదేహాన్ని ఇంట్లోనే పూడ్చిపెట్టి అంత్యక్రియలు పూర్తి చేశాడో భర్త. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని
By అంజి Published on 26 Aug 2022 4:22 PM ISTతన భార్యపై ఉన్న ప్రేమతో ఆమె మృతదేహాన్ని ఇంట్లోనే పూడ్చిపెట్టి అంత్యక్రియలు పూర్తి చేశాడో భర్త. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని డిండౌరీ జిల్లాలో చోటు చేసుకుంది. డిండౌరీలోని వార్డ్ నంబర్‌లో 14లో నివాసం ఉంటున్న ఓంకార్ దాస్.. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. 25 ఏళ్ల కిందట ఓంకార్‌దాస్‌కు రుక్మిణి అనే మహిళతో పెళ్లి జరిగింది. వారికి పిల్లలు పుట్టలేదు. పెళ్లైనప్పటి నుంచి భార్యాభర్తలు ఎంతో అనోన్యంగా జీవించారు. బిర్సాముండా స్టేడియం సమీపంలోని తన నివాసంలో ఆగస్టు 23న అనారోగ్యం కారణంగా రుక్మిణి మృతి చెందింది. రుక్మిణి 10 సంవత్సరాల నుంచి సికిల్ సెల్ అనీమియా అనే వ్యాధితో పోరాడింది.
భార్య మృతిని తట్టుకోలేకపోయాడు ఓంకార్ దాస్. భార్యపై ప్రేమతో ఆమె మృతదేహాన్ని ఇంట్లోనే పూడ్చిపెట్టాడు. సమాధిని పూలతో అలంకరించాడు. ఆ తర్వాత సమాధి పక్కనే పడుకునేవాడు. ఇది 25 సంవత్సరాల వారి అనోన్య దాంపత్యాన్ని చూపెట్టింది. 'ఆమె లేకుండా ఉండలేను' అని ఇంట్లో భార్యను పాతిపెట్టిన వ్యక్తి బంధువులతో చెప్పాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అయితే పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో స్థానికులు కలెక్టర్‌ను ఆశ్రయించారు.
మృతదేహాన్ని వెలికితీసి ఆమెకు సరైన అంత్యక్రియలు నిర్వహించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. పై అధికారుల ఆదేశాల మేరకు మండల తహశీల్దార్ గోవింద్రం సలామే బుధవారం సాయంత్రం పోలీసులతో కలిసి ఉపాధ్యాయుడి ఇంటికి చేరుకున్నారు. మృతదేహాన్ని బయటకు తీసి నర్మదా నది ఒడ్డున పాతిపెట్టారు. ఓంకార్ దాస్ బంధువు జైపాల్ దాస్ పరాస్ మాట్లాడుతూ.. ఓంకార్‌దాస్ తన భార్య మరణంతో ఛిన్నాభిన్నమయ్యాడని, ఆమె మృతదేహం తన చివరి శ్వాస వరకు తన ఇంటిలోనే ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.