దేశ రాజధానిలో ఢిల్లీలో నైట్ లైఫ్‌ను ప్రొత్సహించేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాత్రి సమయాల్లో కూడా పలు సంస్థలను ఓపెన్ చేసుకోవచ్చని లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా నిర్ణయం తీసుకున్నారు. సుమారు 300కు పైగా సంస్థలు 24 గంటలు నడిపేందుకు ఆదివారం ఆమోదం తెలిపారు. దీనిలో ఆన్‌లైన్ షాపింగ్, డెలివరీ షాపులు, హోటల్స్, రెస్టారెంట్లు, ట్రాన్స్ పోర్టు సదుపాయాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. 2016 నుండి పెండింగ్‌లో ఉన్న 314 దరఖాస్తుల ప్రతిపాదనను లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదించారు. ఈ మేరకు ఏడు రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేయాలని ఆయన ఆదేశించారు. 24 గంటలు ఇవి అందుబాటులో ఉంటాయని చెప్పారు. మినహాయింపుల కోసం సంస్థలు చేసిన దరఖాస్తులను పరిశీలించిడంలో కార్మిక శాఖ ఆలస్యం, విచక్షణను ఎల్జీ తీవ్రంగా పరిగణించారు.
ఢిల్లీలో పెట్టుబడిదారులకు, వ్యాపార అనుకూల వాతావరణాన్ని పెంపొందించడానికి, దరఖాస్తులను ఖచ్చితమైన కాలక్రమంలో పరిశీలించాలని ఎల్జీ వీకే సక్సేనా ఆదేశించారు. ఎల్జీ ఆమోదంతో వచ్చే వారం నుంచి షాపులు 24 గంటల పాటు తెరుచుకోనున్నట్లు అధికారులు చెప్పారు. ఈ నిర్ణయం ద్వారా దేశ రాజధానిలో ఉద్యోగ అవకాశాలు పెరగడమే కాకుండా ఆర్థిక అభివృద్ధికి అనుకూలమైన వాణిజ్య వాతవరణం ఏర్పడుతుందని అధికారులు తెలిపారు. వచ్చే వారం నుండి, 300కు పైగా సంస్థలు దేశ రాజధానిలో 24X7 ప్రాతిపదికన పనిచేయగలవని అధికారులు తెలిపారు.