వరసగా మూడో ఏడాది కూడా నంబర్ వన్ ఐఐటీగా..!
IIT Madras Ranked No. 1 For 3rd Time In A Row. దేశంలోనే అత్యుత్తమ విద్యాసంస్థగా మద్రాస్ ఐఐటీ నిలిచింది. కేంద్రం ప్రకటించిన నేషనల్
By Medi Samrat
దేశంలోనే అత్యుత్తమ విద్యాసంస్థగా మద్రాస్ ఐఐటీ నిలిచింది. కేంద్రం ప్రకటించిన నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్(ఎన్‌ఐఆర్‌ఎఫ్)లో వరుసగా మూడోసారి ఓవరాల్ క్యాటగిరీలో మొదటి ర్యాంకును సాధించింది. టాప్-10 విద్యాసంస్థల్లో ఏడు ఐఐటీలే ఉన్నాయి. పరిశోధన, యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌లో బెంగళూరు ఐఐఎస్‌సీ మొదటి స్థానం సాధించింది. జేఎన్‌యూ రెండో అత్యుత్తమ వర్సిటీగా నిలిచింది. ఇంజినీరింగ్ సంస్థల క్యాటగిరీలో టాప్ 10లో ఎనిమిది ఐఐటీలు ఉన్నాయి. బిజినెస్ స్కూళ్లలో ఐఐఎం అహ్మదాబాద్, మెడికల్ కాలేజీల్లో ఢిల్లీలోని ఎయిమ్స్ అగ్రస్థానాలు సాధించాయి. 2021 సంవత్సరానికి గాను ఉన్నత విద్యా సంస్థల పనితీరును మదింపు చేసి నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్(ఎన్‌ఐఆర్‌ఎఫ్) రూపొందించిన ర్యాంకుల జాబితాను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ గురువారం విడుదల చేశారు.
ఏపీ, తెలంగాణకు చెందిన పలు ఉన్నత విద్యా సంస్థలు ఓవరాల్ కేటగిరీ టాప్–100లో చోటు దక్కించుకున్నాయి. ఐఐటీ–హైదరాబాద్ 16వ స్థానంలో, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ 17వ స్థానంలో నిలిచాయి. గత ఏడాది ఐఐటీ–హైదరాబాద్ 17వ స్థానంలో ఉండగా ఇప్పుడు ఒక స్థానాన్ని మెరుగుపరుచుకుంది. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ గత ఏడాది 15వ స్థానంలో ఉండగా.. ఇప్పుడు రెండు స్థానాలు వెనుకబడింది. ఇక ఆంధ్రా యూనివర్సిటీ 48వ స్థానంలో, ఎన్‌ఐటీ–వరంగల్ 59వ, ఉస్మానియా యూనివర్సిటీ 62వ స్థానంలో నిలిచాయి. కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్ ఫౌండేషన్ వర్సిటీ(కేఎల్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్) 69వ స్థానంలో, ఎస్వీయూ 92వ స్థానంలో నిలిచాయి.
యూనివర్సిటీ కేటగిరీల్లో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్–బెంగళూర్ తొలిస్థానంలో నిలిచింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 9వ స్థానంలో నిలిచి టాప్–10లో చోటు దక్కించుకుంది. ఏపీలోని ఆంధ్రా యూనివర్సిటీకి 24వ స్థానం దక్కింది. ఉస్మానియా వర్సిటీ 32వ స్థానంలో, కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్ ఫౌండేషన్ 35వ స్థానంలో, ఎస్వీయూ 54వ స్థానంలో, గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్ 67వ స్థానంలో, ట్రిపుల్ ఐటీ–హైదరాబాద్ 83వ స్థానంలో, విజ్ఞాన్స్ ఫౌండేషన్ ఫర్ సైన్స్, టెక్నాలజీ, రీసెర్చ్ యూనివర్శిటీ 97వ స్థానంలో నిలిచాయి.