అధికారంలోకి వస్తే దళితుడిని డిప్యూటీ సీఎం చేస్తాం.. ఢిల్లీ ప్రజలపై అమిత్ షా వరాల జల్లు

ఢిల్లీలో తాము అధికారంలోకి వస్తే దళితుడిని డిప్యూటీ సీఎంని చేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 3.O సంకల్ప్ పత్రు పేరిట ఆయన మేనిఫెస్టో రిలీజ్ చేశారు.

By Knakam Karthik  Published on  25 Jan 2025 5:48 PM IST
National News, Delhi Assembly Elections, Amith Shah Fire on Kejrival, Bjp, Aap

అధికారంలోకి వస్తే దళితుడిని డిప్యూటీ సీఎం చేస్తాం.. ఢిల్లీ ప్రజలపై అమిత్ షా వరాల జల్లు

ఢిల్లీలో తాము అధికారంలోకి వస్తే దళితుడిని డిప్యూటీ సీఎంని చేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 3.O సంకల్ప్ పత్రు పేరిట ఆయన మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. వృద్ధాప్ప పెన్షన్ రూ.2500, వితంతు పెన్షన్ రూ.3 వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు. అవినీతి రహిత రాష్ట్రంగా ఢిల్లీని తీర్చిదిద్దుతామని అన్నారు. ఎస్సీ, ఎస్టీ స్టూడెంట్స్‌కు నెలకు వెయ్యి రూపాయల స్కాలర్‌షిప్, ఆటో ట్యాక్సీ డ్రైవర్లకు రూ.10 లక్షల లైఫ్ ఇన్సూరెన్స్, రూ. 5 లక్షలకు యాక్సిడెంట్ పాలసీ అమలు చేస్తామని అన్నారు. అటు మహిళలకు కూడా మెటర్నిటీ సెలవులను 6 నెలల వరకు ఇస్తామని అన్నారు. గుజరాత్‌లోని సబర్మతీ రివర్ ఫ్రంట్ తరహాలో కొత్త యమునా నదీ తీరాన్ని అభివృద్ధి చేస్తామని మేనిఫెస్టోను విడుదల చేస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు.

ఈ సందర్భంగా ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర విమర్శలు చేశారు. యమునా నదిని శుభ్రం చేసి లండన్‌లోని థేమ్స్ నదిలా మారుస్తానని హామీ ఇచ్చిన కేజ్రీవాల్.. ఢిల్లీ వాసుల ముందు యమునా నదిలో స్నానం కూడా చేస్తానని కూడా చెప్పారంటూ సెటైర్ వేశారు. మీకోసం ఢిల్లీ ప్రజలు ఎదురు చూస్తున్నారని, యమునా నదిలో మునిగి స్నానం చేయకపోతే.. మహా కుంభ మేళాకు వెళ్లి అక్కడ స్నానమాచరించి పాపాలను పోగొట్టుకోవాలని అమిత్ షా ఎద్దేవా చేశారు.

ఢిల్లీలో బీజేపీ సర్కార్ అధికారంలోకి వస్తే ఆమ్ ఆద్మీ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను నిలిపివేస్తుందని వాట్సాప్‌ ద్వారా ఫేక్ కాల్స్ చేయిస్తున్నారని ఆరోపణలు చేశారు. ఢిల్లీలో పేదల సంక్షేమ పథకాలు ఏవి కూడా నిలిపివేయమన్న అమిత్ షా, బీజేపీ హామీలను తప్పకుండా నెరవేరుస్తుందని పునరుద్ఘాటించారు. లిక్కర్ పాలసీ కేసులో అరెస్టయిన కేజ్రీవాల్ జైలులో ముఖ్యమంత్రిగానే ఉండిపోయారని, నైతిక కారణాలతో రాజీనామా చేయలేదని విమర్శించారు.

Next Story