రూ.2000 కరెన్సీ నోట్లను మార్చుకునేందుకు ఐడీ ప్రూఫ్ అవసరమా?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) రూ. 2000 కరెన్సీ నోట్ల మార్పిడికి సంబంధించి వివరణను అందించింది. ఈ నోట్లను మార్చడానికి లేదా బ్యాంక్
By అంజి Published on 22 May 2023 10:45 AM IST
రూ.2000 కరెన్సీ నోట్లను మార్చుకునేందుకు ఐడీ ప్రూఫ్ అవసరమా?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) రూ. 2000 కరెన్సీ నోట్ల మార్పిడికి సంబంధించి వివరణను అందించింది. ఈ నోట్లను మార్చడానికి లేదా బ్యాంక్ ఖాతాలో డిపాజిట్ చేయడానికి ఎటువంటి ఐడీ రుజువు అవసరం లేదని పేర్కొంది. ఎస్‌బీఐ తన అన్ని శాఖలకు మార్గదర్శకాలను కూడా జారీ చేసింది. గుర్తింపు పత్రాలు, ఫారమ్‌ల అవసరం గురించి సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం ప్రచారంలో ఉన్న నేపథ్యంలో ఈ స్పష్టత వచ్చింది. ఎలాంటి గుర్తింపు కార్డు లేదా ఫారం లేకుండా పది రూ.2000 నోట్లను మార్చుకునే సదుపాయాన్ని పొందవచ్చని బ్యాంక్ స్పష్టం చేసింది. రూ.20 వేల కన్నా ఎక్కువ ఎక్స్‌ఛేంజ్ చేసుకోవాలంటే మాత్రం కచ్చితంగా రిక్విజిషన్ ఫామ్ నింపాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఎస్‌బీఐ బ్రాంచ్‌లు ఎలాంటి ఇబ్బందులు, సమస్యలు రాకుండా నోట్లు మార్చుకునేలా సహకరించాలని కోరింది. బ్రాంచ్ సిబ్బంది కూడా వినియోగదారులకు సహకరించాలని సూచించింది.
రూ.2000 నోట్లపై ఆర్బీఐ నిర్ణయం
క్లీన్ నోట్ పాలసీలో భాగంగా రూ.2000 డినామినేషన్ నోట్లను చెలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్‌బీఐ శుక్రవారం ప్రకటించింది. అయితే, ఇది చట్టబద్ధమైన టెండర్‌గా కొనసాగుతుంది. 2016లో రూ.2000 నోట్లను ప్రవేశపెట్టడం ద్వారా రూ.500, రూ.1000 నోట్ల రద్దు తర్వాత ఆర్థిక వ్యవస్థ కరెన్సీ అవసరాలను తీర్చేందుకు ఉద్దేశించబడింది. ఇతర డినామినేషన్లు అందుబాటులోకి రావడంతో రూ.2000 నోట్ల లక్ష్యం నెరవేరడంతో 2018-19లో వాటి ముద్రణ నిలిచిపోయింది.
డిపాజిట్, మార్పిడి సౌకర్యాలు
ఆర్‌బీఐ ప్రకారం, వ్యక్తులు రూ.2000 నోట్లను ఎలాంటి పరిమితులు లేకుండా సాధారణ పద్ధతిలో తమ బ్యాంకు ఖాతాల్లో జమ చేసుకోవచ్చు. అదనంగా, వ్యక్తులు ఏదైనా బ్యాంక్ బ్రాంచ్‌లో ఇతర డినామినేషన్‌ల నోట్లతో రూ. 2000 నోట్లను కూడా మార్చుకోవచ్చు. ఈ మార్పిడిని మే 23, 2023 నుండి ఒకేసారి రూ. 20,000 వరకు చేయవచ్చు. SBI, ఇతర బ్యాంకులతో పాటు, సెప్టెంబర్ 30, 2023 వరకు రూ. 2000 నోట్లకు డిపాజిట్, మార్పిడి సౌకర్యాలను అందిస్తుంది.