విడాకులు తీసుకున్న‌ ఐఏఎస్ టాపర్స్ జంట‌

IAS Topper Couple Divorced.టీనా దాబి, అమిర్ ఖాన్ లు 2015లో ఐఏఎస్ టాప‌ర్లుగా నిల‌వ‌డంతో పాటు ప్రేమించి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 Aug 2021 6:02 AM GMT
విడాకులు తీసుకున్న‌ ఐఏఎస్ టాపర్స్ జంట‌

టీనా దాబి, అమిర్ ఖాన్ లు 2015లో ఐఏఎస్ టాప‌ర్లుగా నిల‌వ‌డంతో పాటు ప్రేమించి పెళ్లి చేసుకోవ‌డం అప్ప‌ట్లో దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారిన సంగ‌తి తెలిసిందే. తాజాగా ఈ జంట విడాకులు తీసుకుంది. అధికారికంగా న్యాయస్థానం వారికి విడాకులు మంజూరు చేసింది.

వివ‌రాల్లోకి వెళితే.. టినా దాబి 2015 సివిల్స్‌లో మొదటి ర్యాంక్‌ సాధించ‌గా.. కశ్మీర్‌కు చెందిన అమిర్‌ ఖాన్‌ రెండో ర్యాంక్‌ సాధించాడు. శిక్ష‌ణా స‌మ‌యంలో ఏర్ప‌డిన ప‌రిచ‌యం ప్రేమగా మారింది. అధికారులుగా మారిన అనంత‌రం 2018లో వివాహం చేసుకున్నారు. ఆ వెడ్డింగ్ రిష‌ప్ష‌న్‌కు ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడితో పాటు ప‌లువురు కేంద్ర మంత్రులు, అప్ప‌టి స్పీక‌ర్ సుమిత్రా మ‌హాజ‌న్ హాజ‌ర‌య్యారు. మ‌తాంత‌ర వివాహం చేసుకోవ‌డంతో.. అప్ప‌ట్లో ఆ వార్త సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. మ‌త ఆచారాల‌కు అతీతంగా త‌మ పెళ్లి జ‌రిగిన‌ట్లు కూడా ఆ జంట ఒప్పుకుంది. దీంతో ఆ వివాహం అంద‌ర్నీ ఆక‌ర్షించింది.

కాగా.. రాజస్థాన్‌ కేడర్‌కు చెందిన వీరిద్దరూ జైపూర్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రేమలోనూ.. పాలనలోనూ ఈ జంట విజయవంతంగా రాణించారు. అయితే ఏమైందో ఏమోగానీ గ‌తేడాది న‌వంబ‌రులో టినా, అమిర్‌ విడాకుల కోసం జైపూర్‌లోని కుటుంబ (ఫ్యామిలీ) కోర్టును ఆశ్రయించారు. తాము కలిసి జీవించడం సాధ్యం కాదని, తాము పరస్పరం చర్చించుకుని ఈ కీలక నిర్ణయం తీసుకున్నామని కోర్టుకు విన్నవించుకున్నారు.

ఇద్దరూ ఉన్నత చదువులు చదివిన వారు, దేశంలోని ఉన్నత సర్వీస్‌లో తొలి రెండు స్థానాలు సాధించిన వారు కావడంతో విడాకులపై వెనక్కి తగ్గుతారని కుటుంబసభ్యులు భావించారు. కానీ తమ నిర్ణయంపై వెనక్కి తగ్గేది లేదని, మూడేళ్ల తమ వివాహ బంధానికి స్వస్తి పలికారు. వీరి విడాకుల కేసును తాజాగా విచారించిన జైపూర్ ఫ్యామిలీ కోర్టు టీనా దాబి, అమీర్ ఖాన్ తుది నిర్ణయాన్ని మరోసారి తెలుసుకుంది. ఈ నేపథ్యంలో ఐఏఎస్ టాపర్స్ జంటకు ఫ్యామిలీ కోర్టు మంగళవారం నాడు విడాకులు మంజూరు చేసింది.

Next Story