వందేమాతరంపై చర్చ.. ప్ర‌ధాని మోదీని అడ్డుకున్న ఎంపీ.. కార‌ణం..?

లోక్‌సభలో ప్రధాని మోదీ ప్రసంగంతో వందేమాతరంపై చర్చ మొదలైంది.

By -  Medi Samrat
Published on : 8 Dec 2025 2:31 PM IST

వందేమాతరంపై చర్చ.. ప్ర‌ధాని మోదీని అడ్డుకున్న ఎంపీ.. కార‌ణం..?

లోక్‌సభలో ప్రధాని మోదీ ప్రసంగంతో వందేమాతరంపై చర్చ మొదలైంది. వందేమాతరం 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ చర్చ జరుగుతోంది. లోక్‌సభలో ప్రధాని మోదీ తన అభిప్రాయాలను తెలియజేస్తుండగా.. ఒక టీఎంసీ ఎంపీ ఆయనను అడ్డుకున్నారు. ఆ తర్వాత ప్రధాని మోదీ కూడా ఆయనతో జోక్ చేశారు.

ప్రధాని మోదీ లోక్‌సభలో వందేమాతరం ప్రాముఖ్యత గురించి మాట్లాడుతున్నారు. ఆ సమయంలో ఆయన వందేమాతరం రాసిన ప్రముఖ బెంగాలీ కవి బంకిం చంద్ర ఛటర్జీని 'బంకిం దా' అని సంబోధించారు. అయితే ప్రతిపక్షంలో కూర్చున్న టీఎంసీ ఎంపీ సౌగతా రాయ్‌కి అది నచ్చలేదు. ఈ కారణంగానే ఆయన ప్రధాని మోదీని అడ్డుకున్నారు.

సౌగతా రాయ్.. ప్రధానమంత్రి 'బంకిం దా' అని పిలుస్తున్నారు. మీరు ఆయ‌న‌ను బంకిం బాబు అని పిలవాలి అన్నారు. దీనికి ప్రధాని వెంటనే బదులిస్తూ.. 'ధన్యవాదాలు, నేను మీ మనోభావాలను గౌరవిస్తున్నాను.

బంకిం బాబు అంటాను అన్నారు. దీని తర్వాత.. సౌగతా రాయ్‌తో ప్రధాని సరదాగా.. 'నేను మిమ్మల్ని దాదా అని పిలవవచ్చా, లేదా దీనికి కూడా మీకు అభ్యంతరం ఉందా?' అన్నారు.

'దా' అనేది నిజానికి 'దాదా' సంక్షిప్త రూపం.. అంటే సోదరుడు. బెంగాలీ ప్రజలు సోదరులు, స్నేహితులు, పరిచయస్తులను సంబోధించడానికి దీనిని ఉపయోగిస్తారు. ఒక సాంస్కృతిక వ్యక్తి 'దా' అనే పదాన్ని ఉపయోగించడం గౌరవప్రదంగా లేదని తృణమూల్ ఎంపీ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ కారణంగానే ఆయన ప్రధాని మోదీని అడ్డుకున్నారు. దీంతో ప్రధానమంత్రి బంకిం చంద్ర ఛటర్జీని బంకిం బాబు అని పిలిచారు. స్వాతంత్య్రం నుంచి ఎమర్జెన్సీ వరకు, జిన్నా నుంచి బెంగాల్ విభజన వరకు అన్నింటి గురించి మాట్లాడి కాంగ్రెస్ విధానాలను విమర్శించారు. వందేమాతరాన్ని కాంగ్రెస్ ముక్కలు చేసిందని ప్రధాని అన్నారు.

Next Story