మణిపూర్‌లో మరోసారి హింస చెలరేగింది. ఈ ఘర్షణలను అదుపు చేసేందుుకు మరోసారి ఆర్మీ, పారామిలటరీ బలగాలు రంగంలోకి దిగాయి. రాజధాని ఇంఫాల్‌లోని న్యూ చెకాన్ ప్రాంతంలో ఉన్న లోకల్ మార్కెట్ స్థలం విషయంలో వివాదం చెలరేగింది. ఆందోళనకారులు పలు ఇళ్లకు నిప్పంటించాయి. దీంతో భద్రతా బలగాలను భారీగా మోహరించాయి. పరిస్థితి మరింత తీవ్రం కాకుండా కర్ఫ్యూ విధించారు.
ఉదయం ఇంఫాల్‌లోని న్యూ లంబులనే ప్రాంతంలోని ఇళ్లను ఒక గుంపు తగులబెట్టింది. మంటలను ఆర్పేందుకు భద్రతా సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. పరిస్థితిని అదుపు చేసేందుకు ఆర్మీ, పారామిలటరీ బలగాలు రంగంలోకి దిగాయి. అగ్నిప్రమాదాల నివేదికల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కర్ఫ్యూ విధించారు. రాష్ట్రంలో ఇళ్లకు నిప్పుపెట్టడం వంటి ఘటనలు నమోదవుతున్న నేపథ్యంలో ఇంటర్నెట్ సేవలపై నిషేధాన్ని మరో ఐదు రోజులు పొడిగించారు. ఇటీవల మణిపూర్‌లో చెలరేగిన హింసాత్మక ఘటనల్లో 60 మందికిపైగా మృతి చెందినట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ అధికారికంగా ప్రకటించారు. మరో 230 మందికి పైగా గాయపడ్డారు. 1700 ఇళ్లు ధ్వంసమయ్యాయి. 20 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.