మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జగదీష్ యాదవ్ హత్య కేసులో నిందితుడిగా ఉన్న మాజీ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకుడు మిశ్రీ చంద్ గుప్తా హోటల్‌ను జిల్లా అధికారులు కూల్చేశారు. జగదీష్ యాదవ్ హత్య తర్వాత మిశ్రీ చంద్ గుప్తా ను బీజేపీ సస్పెండ్ చేసింది. ఇండోర్‌కు చెందిన ప్రత్యేక బృందం మంగళవారం సాయంత్రం హోటల్‌ను కూల్చివేసేందుకు 60 డైనమైట్‌లను పేల్చింది. క్షణాల్లో భవనం కూలిపోయింది. కూల్చివేత సమయంలో సాగర్ జిల్లా కలెక్టర్ దీపక్ ఆర్య, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ (డిఐజి) తరుణ్ నాయక్.. ఇతర సీనియర్ అధికారులు ఉన్నారు. మిశ్రీ చంద్ గుప్తా హోటల్ జైరామ్ ప్యాలెస్ సాగర్‌లోని మకరోనియా కూడలికి సమీపంలో ఉంది. భద్రత దృష్ట్యా బారికేడ్లు వేసి ట్రాఫిక్‌ను నిలిపివేశారు. హోటల్ చుట్టూ ఉన్న భవనాల్లో నివసించే వారిని కూడా అప్రమత్తం చేశారు. ఇతరులకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని.. భవనాన్ని మాత్రమే కూల్చివేశామని జిల్లా కలెక్టర్ దీపక్ ఆర్య తెలిపారు.
డిసెంబరు 22న కోరేగావ్‌లో నివాసం ఉంటున్న జగదీష్ యాదవ్ అనే వ్యక్తి ఎస్‌యూవీ వాహనం ఢీకొట్టడంతో చనిపోయాడు. బీజేపీ నాయకుడు మిశ్రీ చంద్ గుప్తా, అతని కుటుంబ సభ్యులే ఈ హత్య చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ఎనిమిది మంది నిందితులపై పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. వీరిలో ఐదుగురిని అరెస్టు చేశారు. మిశ్రీ చంద్ గుప్తా అరెస్టు ఇంకా ధృవీకరించలేదు. జగదీష్ యాదవ్ స్వతంత్ర కౌన్సిలర్ కిరణ్ యాదవ్ మేనల్లుడు. ప్రజాసంఘాల ఎన్నికల్లో కిరణ్ యాదవ్.. మిశ్రీ చంద్ గుప్తా భార్య మీనాపై 83 ఓట్ల తేడాతో విజయం సాధించారు. దీంతో కక్ష పెంచుకుని కిరణ్ కు అత్యంత సన్నిహితుడైన జగదీష్ ను అంతం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనతో ప్రజాగ్రహం పెల్లుబికింది.