ఓ వైపు ప్రజలు కరోనాతో ఇబ్బందులు పడుతూ ఉంటే.. ఎన్నో ప్రైవేట్ ఆసుపత్రులు ఆదాయాన్ని పెంచుకోడానికి చూశాయి. దేశంలోని చాలా ప్రాంతాల్లో కరోనా రోగుల దగ్గర నుండి ఎంత పడితే అంత డబ్బులు వసూలు చేశాయి. అయితే అలా వసూలు చేసిన ఆసుపత్రుల మీద అధికారులు చర్యలు చేపట్టారు. ఎక్కువగా వసూలు చేసిన డబ్బులు తిరిగి పేషెంట్స్ కు ఇచ్చేయాలని సూచిస్తున్నాయి. ముగ్గురు కోవిడ్ రోగుల నుండి వసూలు చేసిన అదనపు డబ్బును చికిత్స ఛార్జీలుగా తిరిగి ఇవ్వాలని కర్ణాటక ఆరోగ్య శాఖ ఒక ప్రైవేట్ ఆసుపత్రిని ఆదేశించినట్లు తెలుస్తోంది. BBMP స్పెషల్ కమీషనర్ (ఆరోగ్యం) ఆదేశాల మేరకు, అధికారుల బృందం ఆసుపత్రిని సందర్శించి, ప్రభుత్వం నిర్దేశించిన మొత్తం కంటే ఎక్కువ వసూలు చేస్తున్నట్లు గుర్తించింది.
ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు మించి వసూలు చేయడం చట్ట విరుద్ధమని ఆసుపత్రి యాజమాన్యానికి తెలిపారు. కోవిడ్ రోగుల కుటుంబాలకు ప్రభుత్వం నిర్ణయించిన రేటు గురించి కూడా తెలియజేశారు. ఎక్కువ వసూలు చేస్తే అధికారులను సంప్రదించాలని కోరారు. అధిక ఛార్జీలు వసూలు చేయడంపై వచ్చిన ఫిర్యాదులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆరోగ్యశాఖ ప్రత్యేక కమిషనర్ డాక్టర్ త్రిలోక్‌చంద్ర ఆరోగ్య అధికారులు, హెల్త్ ఇన్‌స్పెక్టర్‌లను ఆదేశించారు. బీబీఎంపీ పరిధిలోని ఆసుపత్రులను వ్యక్తిగతంగా సందర్శించాలని కూడా ఆయన కోరారు. సాధారణ వార్డుకు రోజుకు రూ.10వేలు, హెచ్‌డీయూకు రూ.12వేలు, వెంటిలేటర్ లేని ఐసీయూకు రూ.15వేలు, వెంటిలేటర్ ఉన్న ఐసీయూకు రూ.25వేలు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు యలహంక మండల ఆరోగ్య అధికారిణి భాగ్యలక్ష్మి మణిపాల్ ఆసుపత్రిని స్వయంగా సందర్శించి ఆదేశాలు జారీ చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.