జైలులో 15 మంది ఖైదీలకు హెచ్‌ఐవీ..?

హరిద్వార్ జైల్లో 15 మంది ఖైదీలకు హెచ్‌ఐవీ సోకిందన్న వార్త ఇంటర్నెట్ మీడియాలో వైర‌ల్ అవడంతో తీవ్ర క‌ల‌క‌లం రేగింది.

By Medi Samrat
Published on : 10 April 2025 2:41 PM IST

జైలులో 15 మంది ఖైదీలకు హెచ్‌ఐవీ..?

హరిద్వార్ జైల్లో 15 మంది ఖైదీలకు హెచ్‌ఐవీ సోకిందన్న వార్త ఇంటర్నెట్ మీడియాలో వైర‌ల్ అవడంతో తీవ్ర క‌ల‌క‌లం రేగింది. విషయం తీవ్రరూపం దాల్చడంతో.. జైలు యంత్రాంగం ముందుకు వచ్చి ఇది తప్పుదోవ పట్టించే ప్ర‌చార‌మ‌ని.. వాస్తవం కాద‌ని ఖండించింది. ఈ క్ర‌మంలోనే జైల్లో ఉన్న హెచ్‌ఐవీ సోకిన రోగుల పరిస్థితిని కూడా వివ‌రించింది.

ప్రస్తుతం జైల్లో 23 మంది హెచ్‌ఐవీ సోకిన ఖైదీలు ఉన్నారని పేర్కొంది. వీరిలో కొందరు గత నెల నుంచి ఆరు నెలలుగా జైలులో ఉండగా.. ఒక ఖైదీ గత పదేళ్లుగా జైలులో ఉన్నారని అధికారులు పేర్కొన్నారు. ఆరోగ్య శాఖ ద్వారా అందరికీ చికిత్స అందిస్తున్నామ‌ని.. ప్ర‌చారాన్ని జిల్లా యంత్రాంగం కూడా ఖండించింది. ఇటీవల జైలులో చేరిన ఇద్దరు రోగులలో మాత్రమే HIV సంక్రమణ నిర్ధారించబడిందని వెల్ల‌డించారు.

ఏప్రిల్ 7న జైలులో ఖైదీలకు టీబీ (క్షయ) పరీక్షలు చేసేందుకు హెల్త్ క్యాంపు నిర్వహించారు. హరిద్వార్ జిల్లా జైలులో ఉన్న 15 మంది ఖైదీలకు హెచ్‌ఐవి సోకిందన్న వార్త బుధవారం ఇంటర్నెట్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై హరిద్వార్ సహా ప్రభుత్వ స్థాయి వరకు ఉన్న అధికారులు స్పందించారు. దీని తర్వాత, హరిద్వార్ జిల్లా మేజిస్ట్రేట్ కర్మేంద్ర సింగ్ ఈ ప్ర‌చారం తప్పుదోవ పట్టించేదని పేర్కొంటూ ఒక ప్రకటన విడుదల చేశారు.

ఈ విషయమై సీనియర్‌ జైలు సూపరింటెండెంట్‌ మనోజ్‌ ఆర్య ప్రెస్‌ నోట్‌ విడుదల చేస్తూ.. జైల్లో నిర్వహించిన హెల్త్‌ క్యాంపులో హెచ్‌ఐవీకి కాకుండా క్షయ వ్యాధికి పరీక్షలు చేశామన్నారు. జైలులో ఎప్పటికప్పుడు హెచ్‌ఐవి పరీక్షలు జరుగుతాయని ఆయన తెలిపారు. జైలులోకి ప్రవేశించిన వెంటనే ఖైదీలకు ఇతర ఆరోగ్య పరీక్షలతో పాటు హెచ్‌ఐవీ పరీక్ష కూడా తప్పనిసరి చేస్తారన్నారు.

ఈ ప్రక్రియలో భాగంగానే ఇప్పటివరకూ మొత్తం 23 మంది ఖైదీలకు హెచ్‌ఐవి సోకినట్లు నిర్ధారించబడింది. వీరిలో కొందరు గత ఒకటి నుండి ఆరు నెలల వరకు జైలులో నిర్బంధించబడ్డారు. ఒక ఖైదీ గత 10 సంవత్సరాలుగా ఈ జైలులో ఉన్నారు. జైలుకు వ‌చ్చిన వారు బెయిల్‌పై విడుదలైనప్పుడు లేదా నిర్దోషిగా విడుదలైనప్పుడు HIV రోగుల సంఖ్య పెరుగుతూ.. తగ్గుతూ ఉంటుంది. జైలులో ఎలాంటి ఇన్ఫెక్షన్ వ్యాపించదు. వ్యాధి సోకిన వ్యక్తి బయటి నుంచి కూడా వచ్చినవారేన‌న్నారు. హెచ్‌ఐవీతో బాధపడుతున్న ఖైదీలందరికీ యాంటీ రెట్రోవైరల్ థెరపీ సెంటర్ ద్వారా క్రమం తప్పకుండా చికిత్స అందిస్తున్నామని చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఆర్కే సింగ్ తెలిపారు.

Next Story