ఉక్రెయిన్ నుండి కుమార్తె క్షేమంగా భారత్ కు చేరుకుంది.. వెంట‌నే ఆ తండ్రి ఏం చేశాడంటే..

Himachal Man Donates to PM Cares Fund After Daughter’s Safe Return From Ukraine. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న 32 మంది హిమాచల్ ప్రదేశ్ విద్యార్థులతో కూడిన మొదటి బృందం

By Medi Samrat  Published on  2 March 2022 1:32 PM IST
ఉక్రెయిన్ నుండి కుమార్తె క్షేమంగా భారత్ కు చేరుకుంది.. వెంట‌నే ఆ తండ్రి ఏం చేశాడంటే..

ఉక్రెయిన్‌లో చిక్కుకున్న 32 మంది హిమాచల్ ప్రదేశ్ విద్యార్థులతో కూడిన మొదటి బృందం ఆదివారం సాయంత్రం ప్రత్యేక విమానంలో ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుంది. ఆ విద్యార్థినుల్లో హమీర్‌పూర్‌కు చెందిన అంకితా ఠాకూర్ ఒకరు. అంకిత సోమవారం ఇంటికి తిరిగి వచ్చింది. తన కుమార్తె క్షేమంగా ఇంటికి చేరడంతో ఆమె తండ్రి ఎంతో ఆనందించాడు. దీంతో ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రి సహాయ నిధులకు తనకు తోచినంత సహాయం చేశాడు. అంకిత తండ్రి, JB సింగ్ ఝలేదీలో ఆయుర్వేద ఆరోగ్య కేంద్రంలో డాక్టర్, ఆమె తల్లి అనితా దేవి గృహిణి. హెచ్‌ఆర్‌టిసి వోల్వో బస్సులో హమీర్‌పూర్ బస్ స్టేషన్‌కు వచ్చిన అంకిత తండ్రి ఉద్వేగానికి లోనయ్యారు.

దీంతో పీఎం కేర్స్ ఫండ్‌కు రూ.21000, ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.11వేలు అందించారు. చున్హాల్ గ్రామానికి చెందిన అంకిత ఉక్రెయిన్‌లో రష్యా సైనిక దురాక్రమణ కారణంగా, ఆమె తన చదువును మధ్యలోనే వదిలేసి తిరిగి వచ్చింది. కుటుంబ సభ్యులు అంకితకు హారతి ఇచ్చి స్వాగతం పలికిన తర్వాత కేక్ కట్ చేశారు. హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం సిమ్లా, మండి, కులు, కాంగ్రా, చంబా, హమీర్‌పూర్, సిర్మౌర్, బిలాస్‌పూర్‌లకు చెందిన వారిని స్వస్థలాలకు తీసుకుని రావడానికి బస్సులను పంపింది. ఉక్రెయిన్‌లో ఇప్పటికీ చిక్కుకుపోయిన 130 మంది విద్యార్థుల జాబితాను రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసింది.


Next Story