హిజాబ్ ధరించిన మహిళను భారత ప్రధానిగా చూడాలని కోరుకుంటున్నట్లు ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యానించారు. కర్ణాటకలో త్వరలో జరగనున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కోసం బీజాపూర్‌లో ఉన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈనెల 28న జరగనున్న బీజాపూర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎంఐఎం నాలుగు వార్డుల్లో పోటీ చేస్తోంది. అసదుద్దీన్ ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహించి, ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్‌షో కూడా నిర్వహించారు. హిజాబ్ ధరించిన ఓ ముస్లిం మహిళ భారత ప్రధాని కావాలని ఆకాంక్షించారు.
కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్.. కూడా భారత ప్రధానికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. బ్రిటన్ నూతన ప్రధానిగా రిషి సునాక్ ఎన్నిక అవ్వడం.. భారత సంతతికి చెందిన ఒక హిందువు బ్రిటన్‌కి ప్రధాని కావడం ఒక పాఠం వంటిదని సూచించారు. మన దేశంలో హిందువు, సిక్కు, బౌద్ధ, జైన మతస్తులు కాకుండా ఇతరులు ప్రధాని అవ్వగలరా? అని సూటిగా ప్రశ్నించారు. బ్రిటన్ దేశానికి హిందుత్వవాది అయిన రిషీ సునాక్ ప్రధాని అయ్యాడని.. అదే రీతిలో బీజేపీ ఒక క్రైస్తవుడ్ని గానీ, ముస్లింని గానీ భారత ప్రధాని పీఠంపై కూర్చోబెడుతుందా? అని ప్రశ్నించారు. క్రిస్టియన్‌గా ముద్రపడిన ఇటలీ దేశస్తురాలు సోనియా గాంధీ ప్రధాని అయితే, తాను శిరోముండనం చేయించుకుంటానని సుష్మాస్వరాజ్ చేసిన వ్యాఖ్యల్ని కూడా ఆయన గుర్తు చేశారు.