జనవరి 26నే గణతంత్ర దినోత్సవం ఎందుకు?.. ఈ రోజుకున్న విశిష్టత ఏమిటి?
1947 ఆగస్టు 15నే భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చినా.. 1950లోనే దేశానికి అసలైన స్వరాజ్యం వచ్చింది.
By అంజి
జనవరి 26నే గణతంత్ర దినోత్సవం ఎందుకు?.. ఈ రోజుకున్న విశిష్టత ఏమిటి?
1947 ఆగస్టు 15నే భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చినా.. 1950లోనే దేశానికి అసలైన స్వరాజ్యం వచ్చింది. భారత్.. గణతంత్ర దేశంగా 1950 జనవరి 26న భారత్ అవతరించింది. 1950 జనవరి 26 నుంచి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఈ కారణంగానే ఏటా అదే తేదీన రిపబ్లిక్ డే జరుపుకుంటున్నాం. అయితే జనవరి 26వ తేదీనే రిపబ్లిక్ డే జరుపుకోవడానికి బలమైన కారణం ఉంది. వాస్తవానికి భారత రాజ్యాంగాన్ని 1949 నవంబరు 26నే ఆమోదించారు. అయితే అమలు చేసే తేదీకి ఒక ప్రాముఖ్యత ఉండాలనే ఉద్దేశంతో రెండు నెలలు వేచి చూశారు. జలియన్ వాలాబాగ్ ఉదంతం తరువాత.. భారతదేశ నాయకులు లాహోర్ వేదికగా 1930 జనవరి 26న కాంగ్రెస్ పార్టీ జాతీయ సమావేశంలో మొదటి సారిగా సంపూర్ణ స్వరాజ్యం తీర్మానం చేశారు.
జవహర్ లాల్ నెహ్రూ సారథ్యంలో రావీ నది ఒడ్డున జెండా ఎగురవేసి భారతీయుల స్వాతంత్ర నినాదాన్ని బ్రిటిష్ పాలకులకు గట్టిగా వినిపించారు. ఈ క్రమంలోనే అంతటి ప్రాధాన్యం ఉన్న తేదీకి చరిత్రలో చిరస్థాయి కల్పించాలన్న ఉద్దేశంతో నవభారత నాయకులు రాజ్యాంగ రచన 1949లో పూర్తయినా, మరో రెండు నెలలు ఆగి 1950 జనవరి 26 నుంచి దానిని అమల్లోకి తెచ్చారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశానికి ఒక రాజ్యాంగం ఉండాలని భావించిన నాటి దార్శనికులు, మేధావులు రాజ్యాంగ పరిషత్‌ను ఏర్పాటు చేశారు. దీనికి అధ్యక్షుడిగా డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్, రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఛైర్మన్‌గా డాక్టర్ అంబేడ్కర్‌ను నియమించారు.
1949 నవంబర్ 26న రాజ్యాంగాన్ని.. రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది. భారత రాజ్యాంగాన్ని రూపొందించేందుకు రెండు సంవత్సరాల 11 నెలల, 18 రోజుల కాలం పట్టింది. రాజ్యాంగ రచనకు మొత్తం రూ.64 లక్షలు ఖర్చయ్యింది. జనవరి 26, 1950తో బ్రిటిష్ కాలం నాటి భారత ప్రభుత్వ చట్టం -1935 రద్దయ్యింది. ఆ తర్వాత భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. భారత రాజ్యాంగం.. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య రాజ్యాంగం. విదేశీ పాలన పూర్తిగా అంతరించి స్వదేశీయుల చేతిలోకి భారత దేశం వచ్చిన శుభ సందర్భంగా ప్రతి ఏటా జనవరి 26 రిపబ్లిక్ డే పరేడ్ నిర్వహిస్తారు.