ఇండియన్ ఆర్మీకి కొత్త యూనిఫామ్ తీసుకుని వస్తున్న సంగతి తెలిసిందే. కొత్త డిజిటల్ ప్యాటర్న్ బ్యాటిల్ యూనిఫామ్‌ను తీసుకుని వచ్చారు ఆర్మీ అధికారులు. ఇదిలా ఉంటే ఆర్మీ యూనిఫాం తయారీ విషయంలో కొత్త సమస్య మొదలైంది. కొత్త డిజైన్ తో యూనిఫామ్ ను అమల్లోకి తీసుకురావాలని ఆర్మీ నిర్ణయించగా.. ఆ తయారీ కాంట్రాక్టును తమకే ఇవ్వాలని ఆర్డినెన్స్ క్లాతింగ్ ఫ్యాక్టరీలు (OCF) డిమాండ్ చేస్తున్నాయి. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైన్ (నిఫ్ట్) సంస్థ సహకారంతో రూపొందించిన కొత్త యూనిఫామ్ ను ఈ నెల 15న ఆర్మీడే సందర్భంగా ప్రదర్శించారు.
13 లక్షల మంది సైనికులకు యూనిఫామ్ ను అందించాల్సిన యూనిఫాం కాంట్రాక్టు పొందటానికి ఆయా సంస్థలు పోటీ పడుతున్నాయి. ఆర్మీ బహిరంగ టెండర్ ను పిలిచి, తక్కువ ధరకు కోట్ చేసిన సంస్థకు టెండర్ ఇవ్వాలని యోచిస్తోంది. ఆర్డినెన్స్ క్లాతింగ్ ఫ్యాక్టరీలు వ్యతిరేకిస్తున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థలతో పోలిస్తే ప్రైవేటు కంపెనీల పట్ల ఆర్మీ, కేంద్రాలు అనుకూలంగా ఉన్నాయంటూ ఆర్డినెన్స్ క్లాతింగ్ ఫ్యాక్టరీలు విమర్శలు గుప్పించాయి. ఆర్డినెన్స్ క్లాతింగ్ ఫ్యాక్టరీలు మనుగడ సాగించాలంటే ఇలాంటి ఆర్డర్లు చాలా అవసరమని.. పోరాట దళాల యూనిఫామ్ ల తయారీలో ఆర్డినెన్స్ క్లాతింగ్ ఫ్యాక్టరీలకు మంచి అనుభవం ఉందని చెబుతున్నారు. ఆర్మీ ఉన్నతాధికారులు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.