నీతా అంబానీ మరో మంచి పని.. ఆడవారి కోసమే ప్రత్యేకంగా..
Her Circle initiative for women launched by Nita Ambani. నీతా ముకేశ్ అంబానీ ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా సామాజిక మాధ్యమ వేదిక 'హర్‌సర్కిల్' ను ప్రారంభించారు.
By Medi Samrat
రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ నీతా ముకేశ్ అంబానీ ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా సామాజిక మాధ్యమ వేదిక 'హర్‌సర్కిల్' ను ప్రారంభించారు. మహిళా సాధికారతే లక్ష్యంగా హర్‌సర్కిల్‌ను ప్రారంభించినట్లు రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ నీతా అంబానీ తెలిపారు. మహిళలకు సంబంధించి అన్ని అంశాల (కంటెంట్)కు ఇది వేదికగా నిలవాలన్నది లక్ష్యమని.. హర్‌సర్కిల్.ఇన్ ద్వారా లక్షల మంది మహిళలకు మద్దతుగా నిలుస్తామని తెలిపారు. ఇందుకోసం ప్రతి మహిళ ఈ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో చేరొచ్చని నీతా అంబానీ చెప్పారు.
ఏ దేశం వారైనా, ఏ మతం, సంస్కృతికి చెందిన మహిళలైనా వినూత్న ఆలోచనలు పంచుకోవచ్చని అన్నారు. ఇక ఈ ప్లాట్‌ఫామ్‌పై చదువుకోవచ్చు, వీడియోలు వీక్షించవచ్చు, జీవనశైలి, ఆర్థిక, వ్యక్తిగత అభివృద్ధి, పనితీరుకు సంబంధించి మెళకువలు తెలుసుకోవచ్చని కూడా ప్రకటించారు. లక్షల మంది మహిళలకు మద్దతు, సంఘీభావం ప్రకటించేందుకు ఈ హర్ సర్కిల్ స్రుష్టిస్తున్నందుకు ఆనందంగా ఉందన్నారు. ఒక కుటుంబంలో 11 మంది బాలికల మధ్య కూతురుగా ఎదిగిన తానేం చేయాలో ఆలోచించేదానన్ని చెప్పారు. తన కలలకు అనుగుణంగా తన కూతురు ఈషా అంబానీ నుంచి భేషరతుగా ప్రేమ, విశ్వాసాన్ని పొందానన్నారు. తన కోడలు శ్లోక నుంచి సహానుభూతిని, సహనాన్ని చూశానని తెలిపారు.
'ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ వేదికగా కలలను సాకారం చేసుకోవడానికి హర్‌సర్కిల్ రూపొందించింది. భారతీయ మహిళలతో ప్రారంభించాం. ప్రపంచ వ్యాప్తంగా మహిళలను భాగస్వాములను చేయడానికి ఇది ప్రారంభం. అన్ని సామాజిక వర్గాల మహిళల కలలు, ఆకాంక్షలు, ఆశయాల సాధనకు వేదికగా మారుతుంది' అని రిలయన్స్ సంస్థ తెలిపింది.
మహిళలకు సాధికారత కల్పించడమే లక్ష్యంగా తొలుత ఏర్పాటైన డిజిటల్ నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫామ్ ఇది. ప్రపంచ వ్యాప్తంగా సోదరతత్వాన్ని బలోపేతం చేసేందుకు, పరస్పర సహకారం, మద్దతుతో ఇష్టాగోష్టిగా సంతోషంగా చర్చలు జరిపేందుకు వేదికగా ఉపకరిస్తుందని సంస్థ ప్రతినిధులు భావిస్తూ ఉన్నారు.