కేరళలో భారీ వర్షాలు.. పలు ప్రాంతాల్లో జనం గల్లంతు
Heavy rains in Kerala. కేరళలో భారీ వర్షాలు కురుస్తూ ఉండడంతో దక్షిణాది జిల్లాల్లో నదులు ఉప్పొంగుతున్నాయి. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్
By అంజి Published on 17 Oct 2021 2:24 PM ISTకేరళలో భారీ వర్షాలు కురుస్తూ ఉండడంతో దక్షిణాది జిల్లాల్లో నదులు ఉప్పొంగుతున్నాయి. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజలు ఎప్పటికప్పుడు అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా వర్షాల కారణంగా ఆశ్రయం కోల్పోయిన వారి కోసం రాష్ట్రవ్యాప్తంగా 105 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు విజయన్ తెలిపారు. పరిస్థితులకు అనుగుణంగా మరిన్ని పునరావాస కేంద్రాలను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సీఎం చెప్పారు. పతనమ్‌థిట్ట, కొట్టాయం, తిరువనంతపురం జిల్లాల్లోని మడమోన్, కల్లుప్పర, తుంపమాన్, పుల్లకయార్, మనిక్కల్, వెల్లయ్‌కడవ, అరువిపురం డ్యామ్‌లు నిండుకుండల్లా మారాయని వెల్లడించారు.
కేరళలో ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. వరదల కారణంగా కొట్టాయం, పతనమ్‌థిట్ట జిల్లాలు బాగా దెబ్బతిన్నాయి. పతనమ్‌థిట్టలోని కక్కి డ్యామ్, త్రిసూర్‌లోని షోలాయర్, ఇడుక్కిలోని కుందాల, కల్లరకుట్టి డ్యామ్‌ల వద్ద రెడ్ అలెర్ట్ జారీ చేశారు.
కూటిక్కల్ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడగా, 12 మంది గల్లంతయ్యారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు కేరళలోని డ్యామ్ లు నిండిపోయాయి. ఇడుక్కి జిల్లాలోని మలంకర డ్యామ్ కు వరద పోటెత్తడంతో గేట్లు ఎత్తేందుకు కలెక్టర్ అనుమతి మంజూరు చేశారు. ఎర్నాకుళం జిల్లాలో మువట్టుపుళ నది ఉగ్రరూపం దాల్చింది. నదీ పరీవాహక ప్రాంతాల్లోని ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని అధికారులు స్పష్టం చేశారు. గాలింపు చర్యల కోసం వాయసేన సాయాన్ని కేరళ ప్రభుత్వం కోరింది. కొట్టాయం జిల్లాలోని కూటికల్‌లో సహాయ చర్యల కోసం వైమానిక సాయాన్ని కోరినట్టు ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. కొట్టాయంలో జిల్లాలో కొండ చరియలు విరిగిపడడంతో మూడు ఇళ్లు ధ్వంసం కాగా, పదిమంది గల్లంతయ్యారు.
కొట్టాయం జిల్లా కూట్టికల్ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడ్డాయి. పలువురు ఆ కొండచరియల కింద ఇరుక్కుపోయారు. సమాచారం అందిన వెంటనే అక్కడికి చేరుకున్న రెస్క్యూ టీమ్స్ సహాయక చర్యలు చేపట్టాయి. ఇప్పటికే తొమ్మది మృతదేహాలను వెలికితీసిన రక్షణ సిబ్బందికి తాజాగా మరో రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. దాంతో మొత్తం మృతుల సంఖ్య 11కు చేరింది.