హిమాచల్ ప్రదేశ్-ఢిల్లీలో భారీ వర్షం..!
Heavy rains In Delhi And Himachal Pradesh. హిమాచల్‌ప్రదేశ్‌లో భారీ వర్షాల కారణంగా వరదలు పోటెత్తాయి. వరదల్లో చిక్కుకొని ఎనిమిది
By Medi Samrat
హిమాచల్‌ప్రదేశ్‌లో భారీ వర్షాల కారణంగా వరదలు పోటెత్తాయి. వరదల్లో చిక్కుకొని ఎనిమిది మృతి చెందగా.. మరో ఎనిమిది గల్లంతయ్యారు. కులు జిల్లాలో నలుగురు, లాహౌల్ – స్పితి జిల్లాలో ముగ్గురు, చంబా జిల్లాలో ఒకరు మృతి చెందారని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ డైరెక్టర్ సుదేష్‌కుమార్ మోక్త తెలిపారు. చాలా ప్రాంతాల్లో రహదారులపై కొండచరియలు విరిగిపడ్డాయి. బ్రహంగంగ నదిలో క ఒక్కసారిగా నీటిమట్టం పెరగడంతో వరదల్లో కొందరు కొట్టుకుపోయారు. లాహౌల్‌లోని ఉదయపూర్‌లో మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో వచ్చిన వరదలకు ఇద్దరు కార్మికులతో పాటు ఓ ప్రైవేటు జేసీబీ కొట్టుకుపోయింది.
వెతికేందుకు పోలీసులతో పాటు, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) బృందాలను పంపారు. బుధవారం ఉదయం రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించగా.. కార్మికులను రక్షించేందుకు ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలను పంపాలని కోరినట్లు లాహోల్-స్పితి డిప్యూటీ కమిషనర్ నీరజ్ కుమార్ తెలిపారు. కొండచరియలు విరిగిపడడంతో 60 వాహనాలు చిక్కుకుపోయాయని, చాలా ప్రాంతాల్లో రోడ్లు దెబ్బ తిన్నాయి. చాలా ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడి ఇళ్లపై పడ్డాయి. ఎంతో మంది తమ ఆప్తులను కోల్పోయామని బాధను వ్యక్తం చేశారు.
దేశ రాజధాని ఢిల్లీలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. జూలైలో ఇప్పటివరకు నగరంలో 381 మిల్లీమీటర్ల వర్షాపాతం నమోదైంది. 2003 తర్వాత జూలైలో ఇదే అత్యధిక వర్షపాతమని ఐఎండీ అధికారులు తెలిపారు. సఫ్దర్‌జంగ్ అబ్జర్వేటరీ పరిధిలో మంగళవారం ఉదయం కేవలం మూడు గంటల్లోనే వంద మిల్లీమీటర్ల వర్షాపాతం నమోదైందని పేర్కొంది. ఇంతకు ముందు 2013, జూలై 21న 123.4 మిల్లీమీటర్ల వర్షాపాతం నమోదైంది. 19 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఈ ఏడాది దేశ రాజధానికి రుతుపవనాలు 16 రోజులు ఆలస్యంగా చేరాయి. ఈ నెలలో 14 రోజులు వర్షాలు కురిశాయి.
ఐఎండీ డేటా ప్రకారం సఫ్దర్‌జంగ్ అబ్జర్వేటరీ పరిధిలో ఈ నెల 27 వరకు 108 శాతం అధిక వర్షాపాతం రికార్డయింది. సాధారణ వర్షాపాతం 183.5 మిల్లీమీటర్లు. 2003లో ఆల్ టైమ్ రికార్డు స్థాయిలో 632.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. గత కొద్ది సంవత్సరాలుగా వర్షం కురిసే రోజుల సంఖ్య తగ్గిందని స్కైమెట్ వెదర్ వైస్ ప్రెసిడెంట్ (మెట్రాలజీ) మహేశ్ షలావత్ పేర్కొన్నారు. ఇంతకు ముందు మూడు, నాలుగు రోజుల్లో 100 మిల్లీమీటర్ల వర్షాపాతం నమోదైతే.. ప్రస్తుతం ఐదారు గంటల్లోనే రికార్డవుతుందన్నారు.